Elon Musk SpaceX backer Alpha Wave Global: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మద్దతుదారు అయిన ఆల్ఫా వేవ్ గ్లోబల్ హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్‌లో 6% వాటాను దాదాపు ₹5,160 కోట్లకు కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు మద్దతుదారు అయిన ఆల్ఫా వేవ్ గ్లోబల్, హల్దిరామ్ స్నాక్ ఫుడ్‌లో ఆరు శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఆదివారం తెలిపింది. గతంలో ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌గా పిలువబడే ఆల్ఫా వేవ్ గ్లోబల్, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నూన్ బిన్ జాయెద్ ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంలో ఇది ఒక భాగం.
ఈటీ నివేదికల ప్రకారం.. ఆల్ఫా వేవ్ భారతీయ స్నాక్ దిగ్గజం హల్దీరామ్ స్నాక్స్ లో వాటాలను రూ.5,160 కోట్లకు కొనుగోలు చేస్తుంది. హల్దిరామ్ వాటాలను విక్రయించడం ఇది రెండోసారి. గతంలో సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ హల్దిరామ్ ప్రమోటర్లతో కంపెనీలో దాదాపు తొమ్మిది శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఆల్ఫా వేవ్ పెట్టుబడుల డీల్ ఒకే అయితే భారత్ లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పీఈ కన్స్యూమర్ డీల్ గా నిలుస్తుందని ఈటీ నివేదిక పేర్కొంది. అయితే, ఆల్ఫా వేవ్‌కు హల్దిరామ్ బోర్డులో స్థానం ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు, టెమాసెక్ హల్దిరామ్ బోర్డులో కనీసం ఒక స్థానాన్ని పొందే అవకాశం ఉంది. స్పేస్‌ఎక్స్ కాకుండా, ఆల్ఫా వేవ్ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో లిఫ్ట్, క్లార్నా మొదలైనవి ఉన్నాయి.
కాగా, హల్దీరామ్ భారతదేశంలో చాలా పెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. భారతీయ పోర్ట్‌ఫోలియోలో VLCC, లెన్స్‌కార్ట్, చాయోస్, డ్రీమ్ 11 మొదలైనవి ఉన్నాయి. కాగా, ఈ డీల్ కు సంబంధించి ఆల్ఫా వేవ్ లేదా హల్దిరామ్ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2023 అంచనాల ప్రకారం భారతదేశ స్నాక్ మార్కెట్ రూ. 42,694 కోట్లుగా ఉంటుందని ఈటీ నివేదిక పేర్కొంది.