
ప్రస్తుత కాలంలో రీసైక్లింగ్ రంగం వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా మెటల్ రీసైక్లింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పాత ఎలక్ట్రికల్ వైర్లలోని రాగిని సేకరించి విక్రయించే బిజినెస్ మోడల్ మంచి అవకాశాలు అందిస్తోంది. ఇళ్లలో, ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, పాత భవనాల్లో ఉపయోగించిన వైర్లు పెద్ద మొత్తంలో వ్యర్థంగా మారుతున్నాయి. ఈ వైర్లలో ఉండే రాగి విలువైన లోహం కావడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రాగి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే ఈ బిజినెస్‌ను సరైన ప్రణాళికతో మొదలుపెడితే తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సాధించే అవకాశం ఉంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లగలిగే బిజినెస్ కావడం మరో ప్రధాన ఆకర్షణ.
ఈ బిజినెస్‌లో ప్రధాన పని పాత వైర్ల నుంచి రాగిని బయటకు తీసే ప్రక్రియ. సాధారణంగా ఎలక్ట్రికల్ వైర్లు ప్లాస్టిక్ కోటింగ్‌తో ఉంటాయి. ఆ కోటింగ్‌ను తొలగించి లోపల ఉన్న స్వచ్ఛమైన రాగిని వేరుచేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా లభించే వైర్ స్ట్రిప్పింగ్ మిషన్లు ఉపయోగిస్తారు. ఈ మిషన్లు మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్ రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో మాన్యువల్ లేదా సెమీ ఆటోమేటిక్ మిషన్ సరిపోతుంది. రోజుకు వందల కిలోల వైర్లను ప్రాసెస్ చేయవచ్చు. సేకరించిన రాగిని శుభ్రంగా వేరు చేసి బండిల్స్ రూపంలో నిల్వ చేస్తారు. నాణ్యత ఎక్కువగా ఉంటే మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఈ ప్రక్రియలో నష్టాలు తక్కువగా ఉంటాయి.
రాగి వైర్ల బిజినెస్‌లో కీలక అంశం ముడి సరుకు సేకరణ. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. పాత ఇళ్లను కూల్చే సమయంలో ముందుగానే యజమానులతో ఒప్పందం చేసుకోవచ్చు. ఆ ఇంటిలో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లను సేకరించే హక్కు తీసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిషియన్లు, కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్లతో సంబంధాలు పెంచుకోవడం ఉపయోగపడుతుంది. పాత ఫ్యాక్టరీలు, గోదాములు, షాపులు మూసే సమయంలో కూడా పెద్ద మొత్తంలో వైర్లు లభిస్తాయి. ఈ పనుల కోసం కొందరిని నియమించుకోవచ్చు. వారు ప్రాంతాల వారీగా తిరిగి పాత వైర్లను కొనుగోలు చేస్తారు. ఇలా స్థిరమైన సరఫరా ఏర్పడితే బిజినెస్ నిలకడగా సాగుతుంది.
ఈ రాగి రీసైక్లింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మొదట చిన్న స్థాయిలో పెట్టుబడి అంచనా వేసుకోవాలి. ఒక చిన్న గోదాం లేదా ఖాళీ స్థలం అవసరం. వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ కొనుగోలు చేయాలి. కార్మికుల భద్రతకు అవసరమైన గ్లౌవ్స్, కటింగ్ టూల్స్, స్టోరేజ్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి. స్థానికంగా స్క్రాప్ డీలర్లు, మెటల్ ట్రేడర్లతో పరిచయాలు పెంచుకోవాలి. అవసరమైతే MSME రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంక్ రుణాలు పొందడం సులభం అవుతుంది. ప్రారంభంలో రోజుకు తక్కువ పరిమాణంలో పని చేసినా సరే, మార్కెట్ అవగాహన పెరిగిన తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఈ బిజినెస్‌లో లాభాల మార్జిన్ మంచి స్థాయిలో ఉంటుంది. పాత వైర్లను తక్కువ ధరకు సేకరించి, అందులోని రాగిని వేరు చేసి విక్రయిస్తే ధరలో పెద్ద తేడా కనిపిస్తుంది. ప్రస్తుతం కిలో రాగి ధర దాదాపు రూ. 3 వేల వరకు పలుకుతోంది. ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ బిజినెస్ సక్సెస్ అయితే నెలకు రూ. లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. ఖర్చులు తగ్గితే నికర లాభం మరింత పెరుగుతుంది. డిమాండ్ ఎప్పటికీ తగ్గని లోహం కావడంతో రిస్క్ తక్కువ. క్రమంగా వ్యాపారం పెరిగితే పెద్ద స్క్రాప్ యూనిట్లతో నేరుగా ఒప్పందాలు చేసుకుని మరింత ఆదాయం పొందవచ్చు. దీర్ఘకాలంలో ఇది స్థిరమైన, లాభదాయకమైన బిజినెస్‌గా మారే అవకాశం ఉంది. అలాగే నలుగురుకి ఉపాధి కూడా కల్పించవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించిస్తే మరీ మంచిది.