ప‌నికి రాని పాత డ్ర‌మ్ముల‌తో ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.. ఉన్న ఊరిలోనే బెస్ట్ బిజినెస్‌

Published : Aug 04, 2026, 07:15 PM IST

Business Idea: వ్యాపారం చేయాల‌ని చాలా మంది ఆశ‌తో ఉంటారు. అయితే స‌రైన అవ‌గాహ‌న లేక న‌ష్టాలు చూస్తుంటారు. కానీ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా బిజినెస్ ప్లాన్ చేస్తే భారీగా ఆదాయం పొందొచ్చు. అలాంటి వాటిలో పీవీపీ పైప్‌ల త‌యారీ ఒక‌టి.

PREV
15
పాత డ్ర‌మ్‌ల‌ను రీసైక్లింగ్

ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ వ్యర్థాలను సరిగ్గా రీసైక్లింగ్ చేస్తే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మంచి ఆదాయం కూడా సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాల్లో రీసైకిల్ పీవీసీ పైప్ తయారీ యూనిట్ ఒకటి. పాడైపోయిన ప్లాస్టిక్ డ్రమ్‌లు, పీవీసీ స్క్రాప్ వంటి వ్యర్థాలను ఉపయోగించి కొత్త పీవీసీ పైప్‌లను తయారు చేయడం ద్వారా మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రీసైకిల్ పీవీసీ పైప్ తయారీలో ప్రధానంగా పాత ప్లాస్టిక్ డ్రమ్‌లు, పీవీసీ స్క్రాప్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తారు. ఇవి స్క్రాప్ డీలర్ల నుంచి లేదా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు కలర్ మాస్టర్‌బ్యాచ్ (పైప్‌కు రంగు ఇవ్వడానికి), స్టెబిలైజర్లు, లూబ్రికెంట్లు, ఫిల్లర్ పదార్థాలు (అవసరాన్ని బట్టి), ఇతర ప్రాసెసింగ్ కెమికల్స్ కావాల్సి ఉంటుంది. ఈ మిశ్రమం వల్ల పైప్‌కు బలం, మన్నిక, ఆకర్షణీయమైన రంగు వస్తాయి.

25
తయారీ ప్రక్రియలో మొదటి దశ..

మొదట సేకరించిన పాత ప్లాస్టిక్ డ్రమ్‌లు లేదా పీవీసీ స్క్రాప్‌ను శుభ్రం చేస్తారు. దుమ్ము, మట్టి, ఇనుప ముక్కలు వంటి మలినాలను తొలగించిన తర్వాత వాటిని క్రషర్ మిషన్‌లో వేస్తారు. ఈ యంత్రం పెద్ద ప్లాస్టిక్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. ఇలా తయారైన ముక్కలకు రంగు, అవసరమైన కెమికల్స్ కలుపుతారు.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని హీటింగ్ లేదా ఎక్స్‌ట్రూడర్ బారెల్‌లో వేడి చేస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ కరిగి పొడవైన ప్లాస్టిక్ దారం లాంటి రూపంలో బయటకు వస్తుంది. ఈ దారాన్ని వెంటనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. వీటినే పీవీసీ గ్రాన్యూల్స్ లేదా ప్లాస్టిక్ పెళ్లెట్స్ అంటారు. ఇవే తర్వాత పైప్ తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.

35
గ్రాన్యూల్స్ నుంచి పీవీసీ పైప్ ఎలా తయారవుతుంది?

తయారైన గ్రాన్యూల్స్‌ను మరోసారి పైప్ ఎక్స్‌ట్రూషన్ మిషన్‌లో వేస్తారు. ఈ యంత్రంలో అవి మళ్లీ కరిగి ప్రత్యేక ఆకారంలో ఉన్న డై ద్వారా బయటకు వస్తాయి. ఆ సమయంలో అవి పైప్ ఆకారాన్ని పొందుతాయి. పైప్ బయటకు వచ్చిన వెంటనే అది చల్లబడేందుకు నీటి ట్యాంక్‌లోకి పంపిస్తారు. నీటి ద్వారా చల్లబడటంతో పైప్ గట్టిపడుతుంది. అనంతరం మరో యంత్రం సహాయంతో పైప్‌ను ముందుకు లాగుతారు. చివరగా అవసరమైన పొడవు ప్రకారం ఆటోమేటిక్ కట్టర్‌తో కట్ చేస్తారు. ఆ తర్వాత నాణ్యత పరీక్షలు నిర్వహించి మార్కెట్‌కు పంపిస్తారు.

45
ఏ యంత్రాలు అవసరం? పెట్టుబడి ఎంత కావాలి.?

చిన్న స్థాయి పీవీసీ పైప్ తయారీ యూనిట్ ప్రారంభించాలంటే కొన్ని ముఖ్యమైన యంత్రాలు అవసరం. వీటిలో ప్ర‌ధానంగా ప్లాస్టిక్ క్రషర్, మిక్సర్ మిషన్, గ్రాన్యూల్ తయారీ యంత్రం, పైప్ ఎక్స్‌ట్రూషన్ మిషన్, కూలింగ్ వాటర్ ట్యాంక్, పుల్లర్ మిషన్, ఆటోమేటిక్ కట్టర్, ఎయిర్ కంప్రెసర్, విద్యుత్ కనెక్షన్, ఇతర అనుబంధ పరికరాలు. యూనిట్ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి మారుతుంది. చిన్న స్థాయి యూనిట్‌కు సుమారు రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. పెద్ద సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటు చేస్తే పెట్టుబడి మరింత పెరుగుతుంది.

55
మార్కెట్ అవకాశాలు..

వ్యవసాయ రంగంలో బోర్‌వెల్ కనెక్షన్లు, డ్రిప్ ఇరిగేషన్, నీటి సరఫరా, నిర్మాణ రంగం, కేబుల్ డక్టింగ్ వంటి అనేక అవసరాలకు పీవీసీ పైప్‌ల వినియోగం ఎక్కువగా ఉంది. అందువల్ల నాణ్యమైన ఉత్పత్తి తయారు చేస్తే మార్కెట్‌లో మంచి అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నాణ్యమైన రీసైకిల్ ముడి పదార్థాలనే ఉపయోగించాలి. సరైన కెమికల్ మిశ్రమం పాటించాలి. ప్రతి బ్యాచ్‌పై నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన ప్రభుత్వ అనుమతులు, కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించాలి. మార్కెట్ అవసరానికి అనుగుణంగా వివిధ సైజుల పైప్‌లను తయారు చేయాలి.

పర్యావరణానికి మేలు చేస్తూనే ఆదాయం పొందాలనుకునే వారికి రీసైకిల్ పీవీసీ పైప్ తయారీ వ్యాపారం మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే నాణ్యత, సరైన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడితేనే ఈ రంగంలో దీర్ఘకాలికంగా విజయవంతం కావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories