BSNL దూసుకుపోతోంది.. సిమ్‌ లేకుండానే ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది: దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో ఈ సేవలు ప్రారంభించింది

Published : Jul 01, 2025, 11:42 AM IST

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా చాలా ఈజీగా యాక్సిస్ చేయొచ్చు. ఈ సేవలు దేశంలోనే ఫస్ట్ టైమ్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ నూతన టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
స్వదేశీ పరిజ్ఞానంతో 5G సేవలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్) భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో 5G ఫిక్స్డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ సేవలను దేశంలోనే మొట్టమొదటి సారి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ప్రారంభించింది. 2025 జూన్ 18న హైదరాబాద్‌లో జరిగిన ఈ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ‘BSNL క్వాంటమ్ 5G FWA’ దేశీయంగా రూపొందించిన మొదటి సిమ్‌లెస్ ప్లాట్‌ఫారంగా నిలిచింది.

26
క్వాంటమ్ 5G FWA అంటే ఏమిటి?

ఈ సరికొత్త ఇంటర్నెట్ సర్వీస్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను 5G వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా అందిస్తుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే.. ఇది సిమ్ అవసరం లేకుండా పని చేస్తుంది. వినియోగదారుడు ఇంటిలో లేదా కార్యాలయంలో 5G గేట్‌వేని తానే సెట్ చేసుకోవచ్చు. దీనికి బీఎస్‌ఎన్ఎల్ Direct-to-Device ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా పరికరాలను గుర్తించే వ్యవస్థ ఉంది. అందువల్ల ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్ సెట్టింగ్స్ ద్వారా ఈజీగా ఇంటర్నెట్ సేవలు యాక్సిస్ చేయొచ్చు.

36
ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

BSNL క్వాంటమ్ 5G FWA సర్వీస్ కోసం ఉపయోగించే కోర్ నెట్‌వర్క్, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), కస్టమర్ ప్రిమైసెస్ ఎక్విప్‌మెంట్ (CPE) అన్నీ స్వదేశీ సంస్థల్లోనే అభివృద్ధి చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ విధంగా పూర్తి స్వదేశీ 5G FWA సేవలను అందించిన మొదటి భారతీయ టెలికాం సంస్థగా బీఎస్‌ఎన్ఎల్ రికార్డు క్రియేట్ చేసింది.  

46
ఇంటర్నెట్ స్పీడ్స్ పై అమీర్‌పేట్ ప్రాంతంలో ట్రయల్స్‌

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో నిర్వహించిన ట్రయల్స్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 980 Mbps, అప్‌లోడ్ స్పీడ్ 140 Mbps, లాటెన్సీ <10 మిల్లీసెకన్లు వచ్చాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. ఈ స్పీడ్స్ ద్వారా 4K వీడియోలు, గేమింగ్, వర్క్ ఫ్రం హోమ్ వంటి అవసరాలన్నీ తేలికగా నెరవేర్చవచ్చు.

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ కొన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. అలాంటి వారు వారంలో నాలుగు, ఐదు రోజులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. వారికి బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న క్వాంటమ్ 5G FWA సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

56
రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..

ప్రారంభ సమయంలో బీఎస్‌ఎన్ఎల్ రెండు ప్లాన్లు అందిస్తోంది.

రూ.999 ప్లాన్‌లో 100 Mbps స్పీడ్ లభిస్తుంది.

రూ.1,499 ప్లాన్‌లో 300 Mbps స్పీడ్ లభిస్తుంది.

ఇన్‌స్టాలేషన్ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది. ఎటువంటి తవ్వకాలు లేకుండానే గేట్‌వేను ఇంట్లో పెట్టుకోవచ్చు. హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్ఎల్ టవర్ కవరేజ్ ఆధారంగా 85 శాతం ఇంటింటికీ ఈ సేవ అందించగలగడం విశేషం. అందువల్ల ఆ సర్వీస్ హైదరాబాద్ లో ఉద్యోగులు, ప్రజల అవసరాలను నెరవేర్చడంలో కచ్చితంగా విజయవంతం అవుతుందని బీఎస్ఎన్ఎల్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. 

66
సెప్టెంబర్ నుంచి మరికొన్ని నగరాల్లో ప్రారంభం

బీఎస్‌ఎన్ఎల్ 5G క్వాంటమ్ FWA భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుంది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ సర్వీస్ ఆధునిక టెక్నాలజీతో ఇంటర్నెట్ అనుభవాన్ని మరింత వేగవంతం చేయనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ వరకే ఉన్న సేవలు సెప్టెంబర్ 2025 నాటికి బెంగళూరు, పాండిచేరి, విశాఖపట్నం, పుణే, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్లు ప్రారంభమవుతాయి. వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా సేవల్లో మార్పులు చేస్తామని సంస్థ వెల్లడించింది. 

Read more Photos on
click me!

Recommended Stories