ఏ బైక్ అయినా, స్కూటర్ అయినా వర్షానికి, ఎండకు రక్షణ పొందే విధంగానే తయారు చేస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాటిని అదనపు రక్షణ అందించవచ్చు. వర్షాకాలంలో మీ పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను ఎలా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. వాహనాలు తయారు చేసే కంపెనీలు వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా వాటిని తయారు చేస్తాయి. వెహికల్స్ కు వేసే కలర్, ఇంజిన్ ప్లేస్ మెంట్, బ్యాటరీ, పెట్రోల్ ట్యాంక్, చైన్ ఇలా ముఖ్యమైన భాగాలన్నిటికీ సేఫ్ గార్డ్, ప్రొటెక్షన్ ఉండేలా ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ ఒక్కో సారి వర్షానికి ఆ పార్ట్స్ లోకి నీరు వెళ్లి అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ నార్మల్, ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్‌లకు రక్షణ అందించొచ్చు.
వర్షాకాలంలో మీ వాహనాలను వర్షం నుంచి కాపాడుకోవడానికి అధిక నాణ్యత ఉన్న వాటర్‌ప్రూఫ్ కవర్‌లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ కవర్లు బ్యాటరీ, మోటారు వంటి వాటిలోకి నీరు వెళ్లకుండా అడ్డుకుంటాయి. తక్కువ నాణ్యత ఉన్న వాటికంటే మన్నికైనవి మీ వాహనానికి సరిగ్గా సరిపోయేవి ఉపయోగిస్తే మీ వాహనం పూర్తిగా కవర్ అవుతుంది.
వర్షాకాలంలో చాలా మంది చేసే తప్పేంటంటే.. బండిని శుభ్రంగా ఉంచుకోరు. ఎలాగో వర్షం వల్ల బురదగా మారుతుందని, శుభ్రం చేసినా మళ్లీ బురద అంటుకుంటుందని అనుకుంటారు. ఇది తప్పు. ఎప్పుడు బురద అంటుకున్నా వెంటనే శుభ్రం చేసి సేఫ్ ప్లేస్ లో పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల బురద, దుమ్ము, ముఖ్యమైన భాగాల్లో పేరుకుపోకుండా ఉంటాయి. వర్షంలో తడిసిన తర్వాత తుప్పు పట్టకుండా ఉండటానికి వెంటనే శుభ్రం చేసి తుడిచి పెట్టుకోవాలి.
బయటకు కనిపించే ఎలక్ట్రికల్ కనెక్షన్లు, బ్రేక్‌లు, సస్పెన్షన్ భాగాలపై దృష్టి పెట్టండి. వీటిపై వర్షం పడినప్పుడు అందులో నీరు నిలిచిపోతే తుప్పు పట్టి పాడైపోతాయి. ఇలా జరగకుండా ఉండటానికి మీ వాహనాన్ని బుదర లేకుండా కడిగి, తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. అదేవిధంగా సిలికాన్ కోటెడ్ స్ప్రేలు రక్షణ పూతలుగా ఉపయోగపడతాయి. ఇవి తేమకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ పూతలు పెయింట్ చేసిన ఉపరితలాలకు అదనపు రక్షణను అందిస్తాయి. నీరు చొరబడకుండా నిరోధిస్తాయి. ఈ స్ప్రేల వల్ల బ్యాటరీ పనితీరు మెరుగవుతుంది. వాటి జీవితకాలం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లలో కొన్ని డిజిటల్ ఇండికేషన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల వెహికల్స్ లోకి నీరు వెళ్లిందో లేదో తెలుస్తుంది. అలాంటి డిజిటల్ మీటర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఎలక్ట్రికల్ కనెక్షన్లు తడి, తేమ వల్ల దెబ్బతిన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది షార్ట్ సర్క్యూట్‌లకు దారి తీస్తాయి. వివిధ భాగాలకు నష్టం కలిగిస్తాయి. బ్యాటరీ టెర్మినల్స్, ఛార్జర్ పోర్ట్, వైరింగ్ హార్నెస్‌తో సహా అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సరిచేయించుకోవాలి. అవసరమైతే ఈ కనెక్షన్‌లకు వాటర్ ప్రొటెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఇన్సులేటింగ్ గ్రీజు, తేమ-నిరోధక సీలెంట్‌లను ఉపయోగించండి. వీలైనంత వరకు మీ ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్‌ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. అదేవిధంగా మీ వాహనం రెగ్యులర్ సర్వీసింగ్‌ను మర్చిపోకుండా చేయించండి.
ముఖ్యంగా వర్షాకాలానికి ముందు మరియు తర్వాత తప్పకుండా మీ వాహనాన్ని సర్వీసింగ్ చేయించాలి. ఇది వదులుగా ఉన్న కనెక్షన్లు లేదా నీటి వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ఉపయోగపడతాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు మీ ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్‌ను రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో కొంచెం శ్రద్ధ పెడితే మీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పనితీరును కాపాడుకోవచ్చు. దీని వల్ల మీ వాహనం మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మీ ప్రయాణాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి.