8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ధృవీకరించింది. 18 నెలల్లో రిపోర్టు అందజేయనున్న ఈ కమిషన్, 2026 నుంచి వేతన సవరణ అమలుపై కీలక అప్‌డేట్స్ ఇచ్చింది.
8వ వేతన సంఘంపై పార్లమెంట్‌లో కేంద్రం ఏం చెప్పింది?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Central Pay Commission) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ కమిషన్ విధివిధానాలు, కాలపరిమితి, ప్రస్తుత స్థితిగతులపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నిర్ణయం సుమారు 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై నేరుగా ప్రభావం చూపనుంది.
26
8వ వేతన సంఘం పై పార్లమెంట్‌లో కేంద్రం మంత్రి పంకజ్ చౌదరీ కామెంట్స్
లోక్‌సభలో ఎంపీ ఏ రాజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 నవంబర్ 3వ తేదీనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీర్మానం జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణాలు, అలవెన్సులు, పెన్షన్ విధానాలను సమీక్షించే బాధ్యతను ఈ కమిషన్‌కు అప్పగించారు.
36
8th Central Pay Commission : రిపోర్టు సబ్మిట్ కు 18 నెలల గడువు
కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల కాలపరిమితిని నిర్ణయించింది. అంటే, కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి ఏడాదిన్నర లోపు తన తుది రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో కమిషన్ వివిధ శాఖల నుంచి డేటాను సేకరించి, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి రిపోర్టును సిద్ధం చేస్తుంది. అయితే, ఈ సిఫార్సుల వల్ల ప్రభుత్వంపై పడే ఖచ్చితమైన ఆర్థిక భారం రిపోర్టు అందిన తర్వాతే తెలుస్తుందని మంత్రి వివరించారు.
8వ వేతన సంఘం తన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ప్రభుత్వం మైగవ్ (MyGov) పోర్టల్‌లో 18 కీలక ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందుబాటులో ఉంచింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తిగత ఉద్యోగులు కూడా తమ సలహాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఈ ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడానికి 2026 మార్చి 31 వరకు గడువు పొడిగించారు. పారదర్శకమైన వేతన సవరణ కోసం ఈ ప్రక్రియ అత్యంత కీలకమని భావిస్తున్నారు.
56
8th Pay Commission : జీతాల పెంపు.. బకాయిల లెక్క ఇదే
నిబంధనల ప్రకారం, 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావాలి. అయితే, రిపోర్టు సమర్పణలో ఆలస్యం జరిగితే, పెరిగిన జీతాలు ఉద్యోగుల చేతికి అందడానికి 2026 ద్వితీయార్థం లేదా 2027 వరకు సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, అమలు తేదీని 2026 జనవరి 1 నుంచే పరిగణనలోకి తీసుకుని, అప్పటి నుంచి పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
66
8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. జీతం ఎంత పెరుగుతుంది?
జీతాలు ఎంత మేర పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం స్పష్టమైన అధికారిక సమాచారం లేకపోయినా, ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. గత వేతన సంఘాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.4 నుండి 3.0 మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం పై 20% నుంచి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని భావిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనిష్ఠ వేతనాన్ని కూడా భారీగా సవరించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.