Ola Electric Vehicle : ఓలా ఎలక్ట్రిక్ #EndICEAge క్యాంపెయిన్‌లో భాగంగా S1 X, రోడ్‌స్టర్ X ఈ-స్కూటర్ల పై ఏకంగా 50 వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. మార్చి 31 వరకు ఈ భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఆ వివరాలు మీకోసం.
ఓలా ఎలక్ట్రిక్ సంచలన ఆఫర్: ₹49,999కే S1 X, రోడ్‌స్టర్ X
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో #EndICEAge ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తన పాపులర్ మోడళ్లయిన S1 X (2 kWh) ఈ-స్కూటర్, రోడ్‌స్టర్ X (2.5 kWh) ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం ₹49,999 ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఈ పరిమిత కాల ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
25
పెట్రోల్ వాహనాలకు కాలం చెల్లింది: భవిష్ అగర్వాల్
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ఓలా ఈ నిర్ణయం తీసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ ఎక్స్ లో స్పందిస్తూ, "పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్ ఇంధన స్వయంప్రతిపత్తి సాధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం చమురు దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఐసీఈ వాహనాల యుగాన్ని అంతం చేయడానికి మేము ఎంతటి సాహసోపేత నిర్ణయాలకైనా సిద్ధం" అని పేర్కొన్నారు.
35
₹50,000 వరకు ప్రయోజనాలు.. ఓలా సర్వీస్ గ్యారెంటీ
ఓలా తన మొత్తం పోర్ట్‌ఫోలియోపై ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ మరికొన్ని కీలక హామీలను ఇచ్చింది. వాటిలో
• 8 ఏళ్ల వారంటీ: S1 స్కూటర్లు, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లపై 8 ఏళ్ల పొడిగించిన వారంటీని స్టాండర్డ్‌గా అందిస్తోంది.
• బైబ్యాక్ గ్యారెంటీ: పాత వాహనాన్ని తిరిగి ఇచ్చే సమయంలో 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువను కల్పిస్తోంది.
• సర్వీస్ గ్యారెంటీ: సర్వీస్ డెలివరీలో ఆలస్యమైతే, వినియోగదారులకు ఉచితంగా ఓలా క్యాబ్ వోచర్లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. దీనివల్ల కస్టమర్లకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
మరికొన్ని నగరాలకు ఓలా ఇన్సైడర్స్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్
ఓలా తన పాత కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఓలా ఇన్సైడర్స్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు 150కి పైగా నగరాలకు విస్తరించింది. ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సుమారు 50,000 మంది కస్టమర్లు ఆసక్తి చూపించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పాత మోడల్ స్కూటర్లను వాడుతున్న వారు కొత్త తరం ఈవీలకు అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. పాత కస్టమర్లకు ₹50,000 వరకు అప్‌గ్రేడ్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే, అదే రిజిస్ట్రేషన్ కింద మరో వాహనాన్ని కొనుగోలు చేస్తే అదనంగా ₹20,000 వరకు ప్రయోజనం ఉంటుంది.
55
ఓలా రెఫరల్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు
కస్టమర్ల నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి ఓలా రెఫరల్ ప్రోగ్రామ్‌ను కూడా బలోపేతం చేసింది. ఎవరైనా తన స్నేహితుడిని లేదా బంధువును ఓలా వాహనం కొనమని రిఫర్ చేస్తే, సక్సెస్‌ఫుల్ డెలివరీ తర్వాత రిఫర్ చేసిన వ్యక్తికి ₹5,000 వరకు ఓలా క్రెడిట్స్ లభిస్తాయి. అలాగే కొత్తగా వాహనం కొన్న వ్యక్తికి ₹1,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 2024 ఆగస్టులో లిస్టింగ్ అయినప్పటి నుండి, 2026 ఫిబ్రవరిలో ఓలా అమ్మకాలు అత్యల్ప స్థాయికి పడిపోయిన నేపథ్యంలో, ఈ భారీ ఆఫర్ల ద్వారా సేల్స్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని కంపెనీ భావిస్తోంది.
మార్చి 31 లోపు ఈ ఆఫర్లను అందిపుచ్చుకోవడం ద్వారా వినియోగదారులు భారీగా ఆదా చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని 80 శాతం మంది పాత కస్టమర్లకు ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉండటం విశేషం.