Pices
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
ఉద్యోగం
ఈ సంవత్సరం, మీన రాశిలో జన్మించిన వారికి, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం పదకొండవ ఇంట్లో ఉండటం వలన వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీరు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. మీ పై అధికారుల నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుకుంటారు. ఆయితే సంవత్సరమంతా గురు, రాహు మరియు కేతు గోచారం సామాన్యంగా ఉండటం వలన వృత్తి పరంగా అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిలో శ్రమ అధికంగా ఉండటం, మీకు ఇష్టం లేకున్నప్పటికీ కొంతకాలం దూరప్రాంతంలో కానీ విదేశాల్లో పని చేయవలసి రావచ్చు. విదేశీ యానం చేసినప్పటికీ ప్రారంభంలో అక్కడి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మిత్రులు కానీ, సహోద్యోగుల గాని సమయానికి సహాయం చేసి మీకు ఉన్న సమస్యలు తొలగిస్తారు. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని గోచారం తో పాటుగా సంవత్సరమంతా గురు, రాహువు మరియు కేతువుల గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవడంతో ఈ సమయంలో వృత్తి పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు. ముఖ్యంగా మీరు గతంలో చేస్తానని ఒప్పుకున్న బాధ్యతలను, పనులను సరిగా పూర్తి చేయడంలో విఫలం అవుతారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా పనులు వాయిదా పడటం కానీ ఆగిపోవడం కానీ జరగటంతో కొంత ఇబ్బందికి గురవుతారు. అనవసరమైన మాటల కారణంగా అవమానాలకు గురవటం కానీ, గౌరవమర్యాదలు కోల్పోవటం కానీ జరిగే అవకాశముంటుంది. మీకు ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పనుల విషయంలో వాయిదాలు వేయకుండా నిజాయితీగా ఉండటం అలాగే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటం చేయండి. మాటలకంటే ఎక్కువ చేతలకు ప్రాధాన్యం ఇవ్వటం వలన మీకు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం శని గోచారం, సంవత్సరమంతా గురు మరియు రాహు,కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడంతో ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఆదాయంలో పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఆదాయం వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వచ్చిన డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఇంటిలో శుభకార్యాల కొరకు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే కొంత డబ్బు విలాసాల కొరకు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం పన్నెండవ ఇంట ఉండటంతో ఖర్చు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవడంతో మిత్రుల నుంచి కానీ, ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకొని అవకాశం ఉంటుంది. రాహు గోచారం రెండవ ఇంట ఉండటంతో ఈ సమయంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్ని సార్లు గొప్పలకు పోయి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇతరుల మాటలను పొంగిపోయి డబ్బు ఖర్చు చేసుకోకుండా పొదుపు చేయడం మంచిది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల కొరకు కూడా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో ఆదాయం కూడా బాగానే ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువ ఉండటం వలన వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకోలేకపోతారు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు కానీ, ఇల్లు కాని, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేద్దామనుకునే వారు ఆలోచించి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండే సమయంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం
మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు, రాహువు మరియు కేతువు అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మద్య కాలం శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే అవి నయమవుతాయి. సంవత్సరమంతా గురు గోచారం జన్మరాశి పై ఉండటం వలన ఆరోగ్య విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చేయడం వలన వెన్నెముక, కాలేయం, మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని మరియు రాహువు గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా రాహు గోచారం కారణంగా దంతాలు, మెడ, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సంవత్సరం మధ్యకాలంలో శని గోచారం 11 ఇంట్లో ఉండటం వలన ఈ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం, మరియు ఎక్కువ శారీరక శ్రమ చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం.
కుటుంబ జీవితం
మీన రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో లాభ స్థానంలో శని గోచారం కారణంగా మీ ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో వారి ఆరోగ్యం కారణంగా మీకున్న మానసిక ఆందోళన తగ్గుతుంది. సంవత్సరమంతా గురు గోచారం ఒకటవ ఇంట్లో ఉండటం, రాహు గోచారం కుటుంబ స్థానంలో ఉండటం కేతు గోచారం అష్టమ స్థానంలో ఉండటం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అవగాహన రాహిత్యం ఏర్పడటం కానీ, వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. మీరు చేస్తానని చెప్పిన పని చేయకుండా కేవలం మాట వరకే ఉండటంతో వారు మీ మాట పై నమ్మకం ఉంచరు. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది. భార్య భర్తలు మనస్పర్థలు ఏర్పడటం కాని, అపార్థాలు ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ఓపికగా ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడి సమస్యను పరిష్కరించడం మంచిది. అహంకారానికి పోవడంవలన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
వ్యాపారము మరియు స్వయం ఉపాధి
మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో హెచ్చుతగ్గులను చూస్తారు. సంవత్సరం మధ్యకాలంలో శని లాభ స్థానంలో సంచరించటం, సప్తమ స్థానంపై గురుదృష్టి ఉండటం వలన వ్యాపార అభివృద్ధి పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం సామాన్యంగా ఉంటుంది. ఒక్కోసారి డబ్బు అధికంగా రావడం, మరోసారి తక్కువగా రావడం జరగవచ్చు. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని పన్నెండవ ఇంటిలో సంచరించటం, అలాగే సంవత్సరమంతా రాహువు రెండవ ఇంటిలో సంచరించటం వలన ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా ఆలోచించకుండా పెట్టిన పెట్టుబడుల నుంచి సరైన ఆదాయం రాకపోవడంతో కొంత ఇబ్బందికి గురవుతారు. ఈ సమయంలో గురు దృష్టి ఏడవ మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి రాజకీయ నాయకులు సహాయం కానీ, లేదా ఆర్థిక సంస్థల సహాయం కానీ తోడ్పడుతుంది. అలాగే ఈ సమయంలో మీ భాగస్వాముల నుంచి కూడా కొంత సహాయం అందే అవకాశం ఉంటుంది. దాని వలన వ్యాపారంలో వచ్చిన సమస్యలు దూరమవుతాయి. సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగి పోవడమే కాకుండా వ్యాపారం అభివృద్ధి లోకి వస్తుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు, కళాకారులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా ఒప్పందం చేసుకున్న డబ్బుకంటే తక్కువ ఇవ్వడం కానీ చేసే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం పొందటానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవడంతో మీరు మీ పని విషయంలో కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. సరైన అవకాశాలు దొరకకపోవడంతో ఖాళీగా ఉండాల్సి రావడం కానీ లేదా తక్కువ డబ్బుకి పనిచేయాల్సి రావడం కానీ కావచ్చు. ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి డబ్బు ఖర్చు అదుపు చేసుకోవడం మంచిది. జన్మస్థానంపై గురు గోచారం కారణంగా ఒక్కోసారి తలబిరుసుగా ప్రవర్తిస్తారు. దీని కారణంగా వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశముంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ ప్రతిభకు తగిన వినయంలో మెలగటం మంచిది.
పరిహారములు
మీన రాశిలో జన్మించిన వారు, ఈ సంవత్సరం, గురువుకు, శనికి, మరియు రాహు, కేతువులకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక సమస్యలు గానీ ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుచరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది. సంవత్సరమంతా రాహువు రెండవ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం చేయడం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. ఈ సంవత్సరమంతా కేతువు 8వ ఇంట సంచరిస్తాడు కాబట్టి కుతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు కేతు స్తోత్ర పారాయణం లేదా గణపతి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇదే కాకుండా 7000 సార్లు కేతు మంత్రజపం చేయటం లేదా కేతు గ్రహశాంతి హోమం చేయటం వలన కేతువు ఇచ్చే చెడుఫలితాలు తగ్గుతాయి, ఈ సంవత్సరంలో ఎక్కువ సమయం శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయడం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ, శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. శని మనం చేసే కష్టానికి సంతృప్తి చెందుతాడు కాబట్టి, శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.