Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం మకర రాశి జాతకం

First Published | Apr 1, 2022, 2:32 PM IST

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మకరరాశి వారికి కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.  కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది.  ఈ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది.

Capricorn

ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

Capricorn

మకర రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురువు, శని, రాహువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు.


Capricorn

మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో శని దృష్టి మూడవ మరియు పదవ ఇంటిపై ఉండటంవల్ల వృత్తిలో అనుకోని మార్పులతో పాటు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది.  చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమతో చేయవలసి వస్తుంది.  మీరు చేసే పనికి గుర్తింపు వచ్చినప్పటికీ సమయానికి పూర్తిచేయక పోవటం వలన ఆ గుర్తింపుకు  విలువ లేకుండా పోతుంది.  ఈ సమయంలో రాహు గోచారం కూడా సామాన్యం గా ఉండటం వలన మీ నిర్ణయాల్లో అలసత్వం కారణంగా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన వృత్తిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న పై అధికారులు కాకుండా కొత్తవారు రావడం లేదా  మీరు కొత్త ప్రదేశంలో పని చేయడం లేదా కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.  కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది.  ఈ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది. సంవత్సర ఆరంభంలో, చివరలో శని దృష్టి పదవ ఇంటిపై లేకపోవడం వలన వృత్తిలో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది.  అంతేకాకుండా ఎంత  పని చేసినప్పటికీ సరైన గుర్తింపు లభించక పోవటం వలన  అసహనానికి,  నిరాశా నిస్పృహలకు లోనవుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కొరకు కానీ,   ఉద్యోగం చేసే ప్రదేశంలో మార్పు కొరకు కానీ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం లభించక పోవచ్చు.  అయితే కేతువు గోచారం మధ్యమంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీ పట్టుదలతో, ఓపికతో ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. రాహు గోచారం  నాలగవ  ఇంటిలో ఉండటం వలన మిమ్మల్ని ఉపయోగించుకొని లాభపడే వారు ఎక్కువవటమే కాకుండా, మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు కూడా వారు మీపై చూపించరు. సంవత్సరమంతా గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన మిత్రులు, శ్రేయోభిలాశుల సహాయంతో వృత్తిలో కొంత అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉండటమే కాకుండా వృత్తిలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే  సంవత్సరం మధ్యకాలంలో శని దృష్టి  పదవ ఇంటిపై ఉండటం వలన వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. మీరు చేసే పని నిజాయితీగా చేయడం, ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు  లొంగకుండా ఉండటం వలన వృత్తిలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా  ఎదుర్కోగలుగుతారు.   ఏలినాటి శని సమయంలో వచ్చే ప్రతి సమస్య మీకు భవిష్యత్తులో వచ్చే విజయాలను  ఇవ్వటానికి తప్ప మిమ్మల్ని నష్ట పెట్టడానికో, కష్టపెట్టడానికో కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.  ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని మరింత నిపుణులుగా,  శక్తివంతులుగా చేసి మీలో ఉన్న లోపాలను  తొలగించేదిగా ఉంటుంది.  కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి అడ్డంకిని సహనంతో,  ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయడం మంచిది. 

Capricorn

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా సామాన్య ఫలితాలను ఇస్తుంది.   సంవత్సరం మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  ఆకస్మికంగా ఖర్చులు పెరగడమే కాకుండా,  మీరు గతంలో తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం రావలసిన లాభాల్లో కానీ,  ఆదాయంలో కానీ తగ్గుదల ఉంటుంది.  అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తాయి.  ఈ సంవత్సరమంతా గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు కొంత తగ్గుతాయి.  ఈ సంవత్సరం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ,  స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు.   సంవత్సరం మధ్యలో శని దృష్టి లాభ స్థానం పై ఉండక పోవడం వలన ఆదాయంలో కొంత పెరుగుదల చూస్తారు.  అయితే ఈ సమయంలో విలాసాల కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి  ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో మీరు చేసే దుబారా ఖర్చు భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది. 

కుటుంబం
 కుటుంబ పరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ,  మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావటం కానీ జరగవచ్చు.  మీ మిత్రుల నుంచి కానీ,  కుటుంబ సభ్యుల నుంచి కానీ మీరు ఆశించిన సహాయం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు.  అంతేకాక  మీ మాటకు విలువ తగ్గడం కానీ,  మీరు చెప్పే వాటిని మీ కుటుంబ సభ్యులు సరిగ్గా పాటించకపోవడం కానీ జరగవచ్చు.  దాని వలన మీరు నిరుత్సాహానికి,  అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో  శని గోచారం కుటుంబ స్థానంపై నుంచి లగ్నం పైకి మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ స్నేహితుల సహకారంతో తొలగించుకో గలుగుతారు.  మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సమయంలో నాలుగవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీరు ఉద్యోగ రీత్యా కాని ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి రావడం కానీ,  ఇంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం కానీ జరగవచ్చు.   కేతువు గోచారం   పదవ ఇంటిలో ఉండటం వల్ల మీరు చేసే పనులకు గుర్తింపు రావడం లేదన్న బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది.  ఈ సమయం లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ,  యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించడం కానీ చేస్తారు.  అంతేకాకుండా  సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Capricorn

ఆరోగ్యం
 మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది.  ఏల్నాటి శని సమయం అవటం, గురుగోచారం కూడా సామాన్యంగా ఉండటం వలన శారీరకంగా, మానసికంగా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ఆరంభంలో శని గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య విషయాలు లో మార్పులు చోటు చేసుకుంటాయి.  ఎముకలు,  దంతాలు,  చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు,  గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.  అయితే గురు దృష్టి లాభ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన సరైన వైద్యం లభించి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.  ఈ సంవత్సరంలో రాహు గోచారం కొంత వ్యతిరేకంగా ఉండటం వలన మానసికంగా ఒత్తిడికి గురవడం,  నిద్రలేమి ఎక్కువ ఉండటం,  దాని కారణంగా జీర్ణ శక్తి తగ్గటం జరుగుతుంది.  ఈ సమయంలో  మానసిక ఒత్తిడి తగ్గటానికి,  ఆరోగ్య సమస్యలు తగ్గటానికి సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది.  దీనితో పాటుగా శారీరక వ్యాయామాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.  సంవత్సరం మధ్యలో శని గోచారం తిరిగి జన్మరాశికి మారటం వలన శారీరక ఆరోగ్య విషయంలో కొంత మార్పు ఏర్పడుతుంది.  అయితే మానసికంగా మాత్రం ఏదో తెలియని బాధ,  ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  ఈ ప్రభావం తగ్గటానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చేసుకోవడం మంచిది.  

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు ఇస్తుంది.   సంవత్సర ఆరంభంలో శని గోచారం రెండవ ఇంట ఉండటం,  గురు దృష్టి ఏడవ మరియు పదకొండవ ఇంటి పై  ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది.  గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  మీరు చేపట్టే పనులు విజయం సాధిస్తారు.  అయితే ఈ సమయంలో వ్యాపార సంబంధ ఖర్చులు గాని, పెట్టుబడులు కానీ ఎక్కువగా ఉంటాయి.  వ్యాపార పరంగా ఏవైనా సంస్థలతో కానీ,  ఆధ్యాత్మిక లేదా విద్యా కేంద్రాలతో కానీ భాగస్వామ్యం పెట్టుకోవడం కానీ వారి సహాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం గానీ జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.  అంతే కాకుండా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది.  సంవత్సరం మధ్యలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు రావటం కానీ లేదా వ్యాపారం  మందకొడిగా సాగటం కానీ జరగవచ్చు.  ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ,  కళాకారులు కానీ ఈ సంవత్సరం  మిశ్రమ ఫలితాలు చూస్తారు.   సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం రెండవ ఇంట్లో ఉండటం, సంవత్సరమంతా గురు దృష్టి సప్తమ, మరియు భాగ్య స్థానాలపై ఉండటం వలన పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి.  మీకు అవకాశాలు రావడమే కాకుండా, మీరు పడిన శ్రమకి,  మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది.  అవార్డులు,  రివార్డులు అందుకుంటారు.   సంవత్సరం మధ్యలో శని గోచారం మారటంతో తిరిగి కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది.  కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ మీరు వాటిని  వదులుకొని తర్వాత బాధ పడతారు. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. 

పరిహారాలు
 మకర రాశి వారు ఈ సంవత్సరం శనికి,  గురువుకు,  మరియు రాహువుకు  పరిహారాలు ఆచరించడం మంచిది.  ఈ సంవత్సరం ఈ మూడు గ్రహాల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వీటికి పరిహారాలు చేయడం వలన  అవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది.  శని గోచారం  ఈ సంవత్సరమంతా బాగుండదు కనుక ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ,  హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్రం చదవడం కానీ మంచిది.   ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ,  శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది.  శని మనం చేసే కష్టానికి సంతృప్తి  చెందుతాడు కాబట్టి,  శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి,  వృద్ధులకు,  వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.  ఈ సంవత్సరం  గురు గోచారం మూడవ ఇంటిలో మధ్యమంగా ఉంటుంది కాబట్టి  ప్రతిరోజు గురు గ్రహ స్తోత్రం పారాయణం చేయటం కానీ,  గురు చరిత్ర పారాయణం చేయడం కానీ లేదా  ఇతర గురు సంబంధ స్తోత్రం  పారాయణం చేయడం కానీ చేస్తే గురు సంతృప్తి  చెందుతాడు కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.  ఈ సంవత్సరం రాహువు నాలుగవ ఇంటిలో ఉంటాడు కాబట్టి ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం కానీ,  దుర్గా స్తోత్రం పారాయణం కానీ చేయడం మంచిది.  ఇవే కాకుండా 18,000 సార్లు రాహు మంత్ర జపం చేయటం కానీ, లేదా రాహు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
 

Latest Videos

click me!