Motivational story: జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం అయితే ఆ కష్టాలను మనం ఎలా చూస్తున్నామన్న దానిపైనే మనం ఏంటో అర్థమవుతుంది. ఈ గొప్ప సందేశాన్ని చాటి చెప్పే ఒక ఎమోషనల్ కథ ఈరోజు తెలుసుకుందాం.
రాజేష్ చాలా ఏళ్ల కల తర్వాత చివరకు కొత్త కారు కొనాలని నిర్ణయించాడు. అతని భార్య సునీత, చిన్నారి నేహా ఎంతో ఉత్సాహంగా అతనితో షోరూమ్‌కి వెళ్లారు. కారు తీసుకున్న తర్వాత అందరూ సంతోషంగా ఫోటోలు దిగారు. అది వారి జీవితంలో ప్రత్యేకమైన రోజు. కారు తాళాలు చేతిలోకి తీసుకున్న క్షణం, రాజేష్ గుండెల్లో గర్వం, కళ్లలో ఆనందం మెరుస్తోంది. నేహా కారు సీట్లో కూర్చొని, "ఇది మన ఫ్రెండే..!" అని నవ్వుతూ చెప్పింది.
25
అనుకోని ఘటన
షోరూమ్ నుంచి ఇంటికి చేరే సమయంలో వర్షం మొదలైంది. రోడ్లపై గాలి వేగం పెరిగింది. రాజేష్ జాగ్రత్తగా కారు నడుపుతుండగా ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా కారుపై పడిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్ధం వచ్చింది. సునీత కేక వేసింది. నేహా భయంతో తండ్రి చెయ్యి పట్టుకుంది. అయితే అదృష్టవశాత్తూ చెట్టు కేవలం కారు ముందు భాగానికే తగలడంతో వారు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. చుట్టుపక్కల ఉన్నవారు పరుగెత్తి వచ్చి తలుపులు తెరిచి వారిని బయటకు తీశారు.
35
ఈ కారు మంచిది కాదంటూ..
సునీత షాక్‌లో పడింది. ఆమె కళ్లలో భయం, ఆలోచనల్లో అపశ్రుతి నిండిపోయాయి. "ఈ కారు మనకు మంచిది కాదు రాజేష్..! కొనగానే ప్రమాదం జరగడం ఓ చెడు సూచన. వెంటనే అమ్మేయాలి!" అంటూ కన్నీరితో చెప్పింది. రాజేష్ కూడా అసహనం, దురదృష్టం, కోపం అన్నీ కలిసిన భావంతో కారువైపు చూశాడు. కొత్త సంతోషం ఇలా క్షణాల్లో ఆవిరైపోవడం అతను భరించలేకపోయాడు.
అప్పుడే నేహా నెమ్మదిగా కారువద్దకు నడిచింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆ కారుకు ముద్దు పెట్టి ఇలా చెప్పింది. "థ్యాంక్ యూ… నీవున్నావు కాబట్టి మేము బతికి ఉన్నాం. తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి తన చిన్న చేతులతో రాజేష్ చేతిని పట్టుకుని నమ్మకంగా చెప్పింది. "నాన్న, ఈ కారు లక్కీ... ఎందుకంటే మన ప్రాణాలు కాపాడింది. మనం బైక్‌పై వచ్చి ఉండి ఉంటే… ఇప్పుడు మనం ఇక ఉండేవాళ్లు కాదు. కాబట్టి దీన్ని అమ్మకూడదు. రిపేర్ చేసి వాడుకుందాం. ఆ మాటలు విన్న క్షణంలో రాజేష్ హృదయం కరిగిపోయింది. కారు ప్రమాదం కాదు… రక్షణగా మారిపోయింది.
55
జీవితం పాఠం
రాజేష్ కారు రిపేర్ చేయించుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు నుంచి సునీత కూడా ఆలోచన మార్చుకుంది. ఆ కారు ఇప్పుడు వారి ఇంటిలో కేవలం వాహనం కాదు… ఒక గుర్తు. జీవితాన్ని భయంతో చూస్తే ప్రతిదీ బాధగా కనిపిస్తుంది. కృతజ్ఞతతో చూస్తే ప్రతి సంఘటనలో అర్థం, ఆశీర్వాదం కనిపిస్తుంది. జీవితం మనం ఎలా చూస్తామో, అలాగే మిమ్మల్ని చూపిస్తుంది. కష్టాలు రానివి కావు. కానీ వాటి వల్ల మనం ఆగాలని కాదు, నేర్చుకోవాలని గుర్తు చేస్తాయి.