MP Mithun Reddy Arrested: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి కుటుంబానికి సమాచారం అందించారు. ఆసలు ఏంటి ఈ ఏపీ లిక్కర్ స్కామ్? సిట్ విచారణలో ఏం తేలింది?
వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఆంధ్ర మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. సిట్ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) అరెస్ట్ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఏడుగంటలపాటు సాగిన విచారణ అనంతరం ఆయనను శనివారం అరెస్ట్ చేశారు.
26
ఏపీ లిక్కర్ స్కామ్: సిట్ విచారణలో కీలక విషయాలు
సిట్ అధికారులు మిథున్‌రెడ్డి 7 గంటలకు పైగా విచారించారు. డొల్ల కంపెనీల సృష్టి, అవినీతిమార్గంలో ముడుపుల పంపిణీ, లిక్కర్ పాలసీ రూపకల్పనలో అతని పాత్రపై వివరణ కోరారు.
ముఖ్యంగా డొల్ల కంపెనీల ద్వారా సొమ్ములు ఎవరికి చేరాయన్న అంశంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రైవేట్ సమావేశాల వివరాలు కూడా సిట్ అధికారులు విచారించారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
36
రూ.3,200 కోట్ల స్కామ్, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరణ
2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ మద్యం కుంభకోణం మొత్తం రూ.3,200 కోట్ల అంచనాగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ తిరస్కరణకు గురికావడంతో సుప్రీంకోర్టు కు వెళ్లారు. అక్కడ కూడా ఆయన కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఎల్వోసీ జారీ చేసి ఆయన పరారయ్యే అవకాశాన్ని ముందుగా అంచనా వేస్తూ సిట్, చివరికి ఆయనను అరెస్ట్ చేసింది.
ఈ కేసులో సిట్ దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్ దాదాపు 300 పేజీలతో ఉండగా, 100కి పైగా ఫోరెన్సిక్ నివేదికలు RFSL నుంచి పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు, 268 మంది సాక్షులను విచారించినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది మద్యం వ్యవస్థలో జరిగిన అవినీతికి బలమైన ఆధారాలుగా నిలుస్తుందని భావిస్తున్నారు.
56
ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టుల జాబితాలో 12 మంది
ఏంపీ మిథున్‌రెడ్డితో పాటు ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (A1), స్పై ఆగ్రో ఎండీ సజ్జల శ్రీధర్‌రెడ్డి (A6), భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, మాజీ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ OSD పి.కృష్ణమోహన్‌రెడ్డి వంటి పలువురు ఉన్నారు. ఇంకా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.
66
హీటెక్కిన ఆంధ్ర రాజకీయాలు.. మద్యం పాలసీ మార్పుపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో ఆన్‌లైన్ నుంచి మాన్యువల్ విధానానికి మారడంలో మిథున్‌రెడ్డి పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనివల్ల పారదర్శకత తగ్గి, డొల్ల కంపెనీల ద్వారా అక్రమ ఆదాయం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ మొదలు.. ప్రస్తుత అరెస్టుల పర్వంతో ఆంధ్ర రాజకీయాలు హీటెక్కాయి.
ఏపీ రాజకీయాలను షేక్ చేసిన మద్యం స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ స్థాయి వ్యక్తి అరెస్టు కావడం, ఇతర ప్రముఖులపై విచారణ కొనసాగుతుండటంతో, త్వరలోనే మరిన్ని కీలక మలుపులు తిరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.