
Balineni Srinivas Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారయ్యింది ఆయన పరిస్థితి.
ఓవైపు కూటమి ప్రభుత్వం వైసిపి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టడమే కాదు వైఎస్ జగన్ సొంత అవసరాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసారంటూ విశాఖ రుషికొండ నిర్మాణాలు, ఎగ్ పఫ్ వంటి వ్యవహారాలను బైటపెట్టి పరువు తీస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వైసిపి పార్టీలో పంచాయితీ పెడుతున్నారు... ఆ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ సన్నిహితులను ఆకర్షించే పనిలోపడ్డాయి ఎన్డిఏ కూటమి పార్టీలు.
టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆపరేషన్ ఆకర్ష్ పలితమో లేక పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరుపై చాలాకాలంగా వున్న అసంతృప్తి కారణమో తెలీదుగానీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసిపిని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని ప్రకటించారు. వెళుతూ వెళుతూ తన రాజీనామా నిర్ణయానికి వైసిపి అధినేత వైఎస్ జగన్ కారణమంటూ బాంబు పేల్చారు.
రాజీనామాపై బాలినేని కామెంట్స్ :
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసిపి పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు కూడా. జగన్ బాబాయ్, వైసిపి కీలక నేత వైవి సుబ్బారెడ్డి సోదరి భర్త... అంటే సుబ్బారెడ్డి, బాలినేని బావా బామ్మర్దులు. ఇలాంటి బాలినేని వైసిపిని వీడటం వైసిపికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
రాజీనామా చేసి ఊరికే వెళ్ళిపోవడం కాదు వైసిపి అధినేత వైఎస్ జగన్ తీరును కూడా తప్పుబట్టాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అధికారంలో వున్నపుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా జగన్ తీరు మారడంలేదని... ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అనుసరించే విధానాలు నచ్చడం లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు పంపించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
బాలినేని రాజకీయ జీవితం :
ఒంగోలు జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి సంఘాల నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్ధివిభాగం ఎన్ఎస్ యూఐ నాయకుడిగా, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ లో పనిచేసారు. ఇలా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి చేరుకున్నారు. వైఎస్ కుటుంబంతో బంధుత్వం బాలినేనికి రాజకీయంగా బాగా కలిసివచ్చింది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లోనే కాదు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేసారు బాలినేని. వైఎస్సార్ బ్రతికున్నంత కాలం ఆయనవెంట నడిచిన బాలినేని ఆ తర్వాత జగన్ వెంట వున్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో విభేధించి పార్టీని వీడగా బాలినేని కూడా ఆయనవెంటే నడిచారు. మంత్రి పదవిని వదులుకుని మరీ జగన్ కు మద్దతుగా నిలిచారు.2012 లో కాంగ్రెస్ పార్టీకే కాదు మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైసిపి తరపున ఉపఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.
ఇలా వైసిపి ఆవిర్భావం నుండి జగన్ వెంటే వున్న బాలినేని ఒంగోలు జిల్లాలో కీలక నేతగా మారారు. ఇలా రాజకీయంగా వైఎస్ జగన్ డౌన్ లో వున్నపుడు కూడా బాలినేని ఆయనతోనే వున్నారు. ఇలా జగన్ కు వీరవిధేయుడిగా వ్యవహరించిన ఆయనకు 2019 లో మరోసారి మంత్రిపదవి దక్కింది. జగన్ కేబినెట్ లో రెండేళ్లకు పైగా విద్యుత్, అటవీ శాఖల మంత్రిగా పనిచేసారు.
వైఎస్ జగన్ తో బాలినేనికి ఎక్కడ చెడింది :
మంత్రి పదవి... నెల్లూరు జిల్లా వైసిపిలో పెద్దన్నపాత్ర... ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో బాలినేనికి అనుకోని అనుభవం ఎదురయ్యింది. 2022 లో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ఆనాటి సీఎం వైఎస్ జగన్ బాలినేని పక్కనబెట్టారు. దీన్ని అవమానంగా భావించిన బాలినేని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం, జగన్ పై చూపించిన విధేయతను పక్కనబెట్టేసారు. తిరుగుబాటు స్వరం అందుకున్నారు.
అధినేత జగన్ తోనే కాదు సొంత బావ వైవి సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి రాజకీయంగా దూరం పెరిగింది. ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇప్పించుకోవాలని బాలినేని ప్రయత్నించారు... కానీ ఆయన బావ వైవి సుబ్బారెడ్డి ఈ సీటును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించారు. ఈ నిర్ణయం బాలినేని అసహనాన్ని మరింత పెంచింది. దీంతో ఒంగోలులోనే కాదు రాష్ట్రంలో వైసిపి చేపట్టిన కార్యక్రమాలకు దూరంగా వుంటూ వచ్చారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారతీరు చూసినవారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారతారని అనుకున్నారు. కానీ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించకూడదని వైసిపి పెద్దలు కోరడంతో వెనకడుగు వేసారు. అయితే ఇప్పుడు ఆ పని చేసేందుకు సిద్దమైన ఆయన వైసిపికా రాజీనామా చేసారు.
బాలినేని చూపు జనసేన వైపేనా? :
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి పవన్ తో మాట్లాడిన తర్వాతే ఆయన వైసిపికి రాజీనామా చేసారనే ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బాలినేని జనసేనలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ వైసిపి టికెట్ దక్కడంతో ఈ ప్రచారానికి తెరపడింది. అయితే ఒంగోలు అసెంబ్లీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయకేతనం ఎగరేసింది. దీంతో వైసిపిపై కొనసాగుతున్న అసంతృప్తికి అధికారం కోల్పోవడం తోడయి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమయ్యారు.