Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చే పనిలో పడింది. ఎన్నికల వేళ టిడిపి, జనసేన, బిజెపి కూటమి 'సూపర్ 6'పేరిట ప్రజలకు పలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి హామీల అమలుకు సిద్దమయ్యింది. ఈ క్రమంలో ఇవాళ ఎన్డిఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయులు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కీలక ప్రకటన చేసారు.
Gas cylinder
ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకంపై క్లారిటీ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద, మద్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ స్కీమ్ హామీని ప్రారంభించనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే దీపావళి పండగరోజే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన
మహాశక్తి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ వుంది. దీనితోనే సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది కూటమి ప్రభుత్వం.
అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఈ కార్డు కలిగిన కుటుంబాల్లో మహిళల పేరిట ఈ ఫ్రీ సిలిండర్ల పంపిణీ చేపట్టనున్నారు. దీపావళి పండగపూట స్వయంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి.
Chandrababu Pawan
కూటమి ఎన్నికల హామీలు :
'దీపం' పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు
చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి రూ.1,500 సాయం
మహిళలందరికీ ఉచితంగానే ఆర్టిసి బస్సులో ప్రయాణించే సౌకర్యం.
యువగళం పేరుతో రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు. అలాగే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి
రైతులకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం.
ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసేందుకు కుళాయి ఏర్పాటు
బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం.
Chandra Babu
దీపావళి నుండే పథకాల అమలు ప్రారంభం :
ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమానికి దీపావళి నుండి శ్రీకారం చుడుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసగించారు.
గ్యాస్ సిలిండర్ల పంపిణీతో ప్రారంభించి ఒక్కోటిగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేసారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబు సూచించారు. ఈ ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందామని సూచించారు.
Chandra Babu
మన ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు... అందువల్లే ఇంతటి భారీ మెజారిటీతో గెలిపించారని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించడం తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. 1994లో కూడా ఇంత మెజారిటీ రాలేదన్నారు. మూడు పార్టీలు అనుసరించిన విధానమే ఈ ఘన విజయానికి కారణమన్నారు. మనపై నమ్మకం పెట్టుకున్న ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారు మెచ్చుకునేలా అందరి నడవడిక ఉండాలని చంద్రబాబు సూచించారు.
మనందరిపై పవిత్రమై బాధ్యత ఉంది... ప్రతి అడుగూ ప్రజల కోసం వేయాలని సూచించారు. అనునిత్యం పేదల కోసం పని చేయాలి. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కూటమి ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. ఈ వందరోజుల పాలనా కాలకం మీరు చూపించిన సమన్వయం అమోఘం...దీన్ని మరింత దృఢత్వంతో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.