
Andhra Pradesh Cricket : క్రికెట్ ఇకపై జెంటిల్ మెన్ గేమ్ మాత్రమే కాదు... జెంటిల్ ఉమెన్ గేమ్ కూడా. పురుషాదిక్య ఆటల్లో ఒకటైన క్రికెట్ లో అమ్మాయిల హవా మామూలుగా లేదు... ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవకాశం వస్తే ఆడవాళ్ళు ఆటల్లోనూ అద్భుతాలు చేయగలరని నిరూపించారు టీమిండియా ఉమెన్ క్రికెటర్స్. ప్రస్తుతం ఉమెన్ క్రికెట్ కు ఆదరణ పెరుగుతుండటంతో తల్లిదండ్రులు కూడా అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా క్రికెట్ ఆడించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే క్రికెటర్ గా రాణిస్తున్న అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. మంచి గుర్తింపు దక్కడమే కాదు మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) కోసం క్రికెటర్ల వేలంపాట నిర్వహించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) సిద్దమవుతోంది. అంటే ఈ APL లో ఆడే ఆంధ్రా ఉమెన్స్ క్రికెటర్లకు టాలెంట్ ఆధారంగా భారీగా డబ్బులు లభిస్తాయి. ఏపిఎల్ ఆక్షన్ గురించి టీమిండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ వెల్లడించారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజయం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టింది తెలుగమ్మాయి శ్రీ చరణి. ఆమెతో పాటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా వచ్చారు. ఈ క్రమంలో మిథాలీ ఉమెన్స్ క్రికెట్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణిని కొనియాడారు.
ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ని టీమిండియా గెలుచుకోవడంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది... బంతితో అద్భుతాలు చేసిందన్నారు మిథాలీరాజ్. వరల్డ్ కప్ మెగా టోర్నీలో అన్ని మ్యాచులు ఆడిన శ్రీ చరణి మెరుగైన ప్రదర్శన చేసిందన్నారు. తన ఆటతో శ్రీ చరణి కోట్లాదిమంది అభిమానులకు సంపాదించుకుందన్నారు. తాను కామెంట్రీ చేసే సమయంలో చరణి బౌలింగ్ ను ప్రశంసిస్తూ అనేకమంది కామెంట్ చేసేవారని పేర్కొన్నారు. డబ్ల్యుపిఎల్ లో కూడా శ్రీ చరణి అద్బుతంగా ఆడిందన్నారు. ఇలాంటి టాలెంటెడ్ క్రికెటర్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణమని మిథాలీ రాజ్ అన్నారు.
మహిళల క్రికెట్ లో పరిస్థితులు మారిపోయాయని... ఏసిఏ కూడా మహిళా క్రికెటర్లకు చాలా సహకరిస్తోందన్నారు మిథాలి. రాష్ట్రంలో ఉమెన్స క్రికెటర్లను జిల్లా స్థాయినుండి ప్రోత్సాహిస్తోంది...వారిని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అమ్మాయిలకోసం కూడా ఏపిఎల్ నిర్వహిస్తున్నారన్నారు. ఏసిఏ ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్దతో ఉమెన్స్ క్రికెట్ ను ప్రోత్సహిస్తున్నారని మిథాలీ రాజ్ అన్నారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత స్వరాష్ట్రానికి విచ్చేసిన శ్రీ చరణిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. శ్రీ చరణి మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు.. వీరికి స్వయంగా మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఇద్దరికీ పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు లోకేష్. తర్వాత ఆయనే వారిని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారు... వారిని అభినందించిన చంద్రబాబు కూర్చోబెట్టి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తన వరల్డ్ కప్ అనుభవాలను సీఎంతో పంచుకున్నారు శ్రీ చరణి. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని... మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు.
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత శ్రీ చరణికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతితో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో ఉమెన్స్ క్రికెటర్లు శ్రీ చరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఘన స్వాగతం లభించింది. వారికి స్వయంగా మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి స్వాగతం పలికారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కూడా వీరితో ఉన్నారు. విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా వారిని సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రోడ్డుపొడవునా ప్రజలు ఈ మహిళా క్రికెటర్లకు నీరాజనాలు పట్టారు.