Pawan Jagan
Tirupati stampede : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి రోజును శ్రీవారిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని... పాపపరిహారం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ప్రతిఏడాది ఒక్కసారి మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారం నుండి తిరుమల వెంకన్నను దర్శించుకోడానికి భక్తులు ఎగబడతారు. ఈ ఏడాది కూడా వైకుంఠ ఏకాదశికి ముందు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
భక్తులు సంఖ్య ఎక్కువగా వుండటంతో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో టికెట్ల పంపిణీకి ఏర్పాటుచేసింది టిటిడి. కానీ అంచనాలకు మించి భక్తులు రావడం, సరిపడా భద్రతాచర్యలు లేకపోవడం, టిటిడి అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం... కారణం ఏదయితేనేం వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీ భక్తుల ప్రాణాలమీదకు తెచ్చింది. టికెట్ల కోసం భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయపడ్డారు. పవిత్రమైన తిరుపతిలో శ్రీవారి భక్తుల మృతి తెలుగు ప్రజలనే కాదు యావత్ దేశాన్ని కలచివేసింది.
నిన్న(గురువారం) తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రముఖులు పరామర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించారు.
బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చంద్రబాబు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అంతేకాదు తొక్కిసలాటలో చనిపోయిన శ్రీవారి భక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, మిగతావారికి రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ ఘటనగురించి హాస్పిటల్ వద్దే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పవన్ మాట్లాడుతున్న సమయంలోనే హాస్పిటల్ వద్దకు వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇలా ఇద్దరు ముఖ్యనేతలు ఒకేసారి హాస్పిటల్ రావడంతో కోలాహలం నెలకొంది.
Pawan Kalyan
పవన్ మాట్లాడుతుండగా జగన్ ఎంట్రీ :
తిరుపతి తొక్కిసలాట ఘటనగురించి పవన్ కల్యాణ్ సీరియస్ గా మాట్లాడుతుండగా మజీ సీఎం జగన్ హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా వైసిపి కార్యకర్తలు, జగన్ అభిమానుల పెద్దఎత్తున సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసారు. జగన్ వెంట పెద్దఎత్తున వచ్చిన నాయకులు, కార్యకర్తలతో హాస్పిటల్ వద్ద కోలాహలం ఏర్పడింది.
ఒకేసారి నినాదాలు మారోమోగడం, సందడి నెలకొనడంతో మీడియాతో మాట్లాడుతున్న పవన్ ఏమయ్యిందని పక్కవారిని అడిగారు. వాళ్లు జగన్ వచ్చారని చెప్పారు. దీంతో ఏ రియాక్ట్ కాకుండానే పవన్ తన మాటలను కంటిన్యూ చేసారు.
ఇక అప్పటికే పవన్ కల్యాణ్ కోసం కూడా జనసైనికులు, మెగా ఫ్యాన్స్ హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఇలా ఇరువుల నేతలు ఒకేసారి రావడంతో పద్మావతి హాస్పిటల్ జనసంద్రంగా మారింది. తమ నాయకులను చూసిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ సందడి చేసారు.
బాధితులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతున్నపుడు పవన్ ఫ్యాన్స్ సందడి చేసారు. తమ నాయకుడు పవన్ కు అనుకూలంగా నినాదాలు చేసారు జనసైనికులు... అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా జగన్ మాటలు కొనసాగించారు. పవన్ కల్యాణ్ కూడా అభిమానులతీరుపై అసహనం వ్యక్తం చేసారు.
బాధాకరమైన పరిస్థితుల్లో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన తనను చూసి అభిమానులు కేకలు పెట్టడం, చేతులు ఊపుతూ కోలాహలం సృష్టించడంతో పవన్ సీరియస్ అయ్యారు. ఇదా మీ అభిమానానికి సమయం... మీకెవ్వరికీ బాధగా లేదా... ఇది ఆనందించే సమయమ! ఇక్కడ మనుషులు చనిపోయారు అంటూ అరిచారు. పోలీసులను వెంటనే ప్రజలను కంట్రోల్ చేయాలని పవన్ ఆదేశించారు.
Pawan Kalyan
తిరుపతి తొక్కిసలాటలో కుట్ర : పవన్ కల్యాణ్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో కుట్ర ఏమైనా వుందా అన్న అనుమానాన్ని డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తం చేసారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే కుట్ర జరిగిందేమోనన్న అనుమానాన్ని పవన్ వ్యక్తం చేసారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని... తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు.
పోలీసుల తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు... ఇప్పటికీ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో పోలీసులు విఫలం అవుతూనే వున్నారన్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ పోలీసుల తీరు మారలేదని... హాస్పిటల్ వద్దకూడా అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. తాను ఆదేశిస్తే గాని ఇక్కడున్నవారిని కంట్రోల్ చేయలేకపోయారని... ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
టిటిడి అధికారులపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. వ్యక్తులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందని... టిటిడి అధికారులు సమన్వయంతో వ్యవహరించివుంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదన్నారు. రోజూ లక్షలాదిమంది తిరుమలకు వస్తుంటారు... అప్పుడు ఎలాంటి ఘటనలు జరగవు... కానీ టికెట్ల కోసం కేవలం 2-3 వేలమంది వస్తే ఈ ఘటన జరగడం అనుమానాస్పదంగా వుందన్నారు పవన్.
ఈ ఘటనకు టిటిడి ఈవో, ఇతర ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడాలని సూచించారు. భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా ఇంటికి చేరేలా చూడాల్సిన బాధ్యత టిటిడిపై వుంది... ఇకపై అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ సూచించారు.
YS Jagan
చంద్రబాబు వల్లే తొక్కిసలాట : వైఎస్ జగన్
ప్రతిపక్ష వైసిపి అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు బాధ్యులు సీఎం చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపించారు. సీఎం కుప్పం పర్యటన కోసం పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా అక్కడికి వెళ్లిందని... అందువల్లే వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీకి పోలీస్ భద్రత ఇవ్వలేకపోయారని అన్నారు. పూర్తిస్థాయిలో పోలీస్ భద్రత కల్పించివుంటే ఈ ఘటన జరిగేది కాదు... భక్తులను కంట్రోల్ చేసేవారని అన్నారు. కాబట్టి ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యులని జగన్ ఆరోపించారుజ
తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులను సెక్యూరిటీ లేదన్నారు. టికెట్ల కోసం వచ్చినవారికి గంటల తరబడి ఎదురుచూసేలా చేసి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. వారిని కనీసం మనుషులుగా చూడలేదు... రక్షణను గాలికి వదిలేసారన్నారు. తమ ప్రభుత్వం గతంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేసేదని జగన్ పేర్కోన్నారు.
తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పేనని జగన్ అన్నారు. కాబట్టి ప్రతి మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేసారు. అలాగే గాయపడ్డ ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం ఇప్పించి రూ.5 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ చావులకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసారు.