ఆ దేవుడి కంటే ఈ ద్వారమే ముఖ్యమా?

First Published | Jan 9, 2025, 5:06 PM IST

తిరుమల వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుని ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు భక్తులు. ఈ క్రమంలో ఆ దేవుడు ముఖ్యమా? ఆ ద్వారమే ముఖ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. 

Tirupati stampede

Tirupati stampede : తిరుపతి తొక్కిసలాటలో తప్పు ఎవరిది? టికెట్ల కోసం ఎగబడ్డ భక్తులదా? సరైన జాగ్రత్తలు తీసుకుకోండా టికెట్ల పంపిణీ చేపట్టిన టిటిడిదా? భక్తులను నియంత్రించడంలో విఫలమైన పోలీసులదా? ... తప్పు ఎవరిదైనా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికే శ్రీవారి దర్శనటికట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

దైవదర్శనానికి వెళ్లినవారు ఇలా ప్రాణాలు కోల్పోవడం కేవలం వారి కుటుంబాల్లోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదాన్ని నింపింది. ఇలా ఆపదమొక్కులవాడి దర్శనం కోసం భక్తులు ఎన్ని ఆపసోపాలు పడుతున్నారన్నది మరోసారి పాలకులకు, ప్రజలకు అర్థమయ్యింది. దేవుడిని దర్శించుకునేందుకు ప్రాణాలకు తెగించాలా?  తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట తర్వాత చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.

'అందుగలడు ఇందు లేడని సందేహం వలదు... ఎందెందు చూసినా అందందు గలడు'... దెవుడు అన్నిచోట్ల వుంటాడనేది దీని అర్థం. కానీ ఈ మాటలను చాలామంది నమ్మడం లేదు తిరుపతి తొక్కిసలాటతో అర్థమవుతోంది. ఆ దేవుడు కేవలం గుడిలోనే వుంటాడని భక్తులు భావిస్తున్నారు... అందువల్లే దేవాలయాల్లో రద్దీ పెరిగి తాజాగా తిరుపతిలో జరిగినట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.  

అసలు దేవుడి దర్శనం కోసం ప్రాణాలకు తెగించాల్సి రావడం ఏమిటి? ఈ రోజుల్లో దేవుడిని దర్శించుకుంటేనే ముక్తి లభిస్తుందా? మిగతా రోజుల్లో దర్శించుకుంటే రాదా? అన్నది ఇప్పుడు ప్రజల భావన. 

చివరకు ఆ దేవుడి కంటే ఈ వైకుంఠ ద్వార దర్శనమే ఎక్కువయి పోయింది. అంటే ఆ దేవదేవుడు ముఖ్యమో? ఆ ద్వారమే ముఖ్యమో అర్థకావడం లేదు. ఈ ద్వారం గుండా వెళితేనే ముక్తి లభిస్తుందంటే మిగతా రోజుల్లో కూడా దీనిగుండానే భక్తులకు దర్శనం కల్పిస్తే బావుంటుంది కదా? మిగతా ద్వారాలు ఎందుకు పెట్టినట్లు అని అడుగుతున్నారు ఈ తొక్కిసలాట ఘటనతో మనస్తాపానికి గురైనవారు. 
 

Tirupati stampede

దేవుడు ముఖ్యమా? ద్వారం ముఖ్యమా?

తిరుపతి విషాద ఘటన తర్వాత కొన్ని ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోకుంటే ఏమైనా కోల్పోతామా? పాపపరిహారం ఉండదా? ఎన్ని పుణ్యాలు చేసినా ముక్తి లభించదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించడంలేదు.

అయినా ఒక మనిషి చేసే పాపపుణ్యాల చిట్టా భగవంతుడి దగ్గర ఉంటుంది...  ఆయనను శరణు వేడితే ఎన్నో పాపాలు చేసే రాక్షసులను సైతం కనికరించి ముక్తి ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మీరు ఇంట్లో కూర్చుని భక్తితో పిలిచినా ఆ దేవదేవుడు పలుకుతాడని పెద్దలు, స్వాములు చెబుతుంటారు. అలాంటప్పుడు ఇలా ఉత్తర ద్వార దర్శనాలతో పనేమిటని చాలామంది వాదన. ఏదేమైనా తొక్కిసలాట తర్వాత వైకుంఠ ద్వారా దర్శనంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. 
 
ఉత్తరద్వారం నుండి వచ్చి దర్శనం చేసుకోకుంటే ఆ దేవుడు ముక్తి ప్రసాదించడా? వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు దర్శన భాగ్యం లభించదా? అని ఆ శ్రీవారి భక్తుల్లో ఓ ప్రశ్న ఉత్పన్నమయ్యింది. అంటే కొందరు ప్రవచనకారులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటేనే ముక్తి లభిస్తుందని చెబుతుంటారు. ఈ ద్వారా దర్శనం చేసుకోకుంటే పుణ్యపలం దక్కదని చెబుతుంటారు. అంటే ఆ దేవుడు నేరుగా  దర్శించుకుంటే పుణ్యం ప్రసాదించడు... ఉత్తర ద్వారం ద్వారా వస్తేనే ప్రసాదిస్తాడంటే ఆ దేవుడు కంటే ద్వారమే ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. 

అ ద్వారమే ముఖ్యం అనుకొన్నప్పుడు ఇక ఆలయానికి ఇతర ద్వారాలు ఎందుకు? అనేవారు వున్నారు. ఈ ఒక్క ద్వారం నుండి వస్తేనే పుణ్యం వస్తుందంటే నిత్యం ఇదే మార్గంలో భక్తులకు దర్శనాలు కల్పించవచ్చు కదా... అప్పుడు అందరికి ముక్తి లభిస్తుంది.... ఇలాంటి తొక్కిసలాట వంటి ఘటనలు కూడా వుండవు అంటూ మరికొందరు వాదిస్తున్నారు.
 


Tirupati stampede

కేవలం విష్ణుమూర్తి  ఒక్కరే ముక్తిని ప్రసాదిస్తారా? 

వైకుంఠ ద్వారం అనేది ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లోనే కనిపిస్తుంది. అంటే కేవలం ఆ విష్ణుమూర్తి ఒక్కరే ముక్తిని ప్రసాదిస్తారా? అనే వాదన మొదలయ్యింది. పరమశివుడు, అమ్మవార్లు, ఇతర దేవాలయాల్లో ఇలాంటి ద్వారాలు వుండవు? అంటే వారు ముక్తిని ప్రసాదించరని అర్థమా. వైకుంఠ ద్వార దర్శనం అర్థం ఇది కానేకాదు.  

ఈ వైకుంఠ ద్వార దర్శనాలు వంటి ఆచారాలు కేవలం మనిషిని భక్తిమార్గంలో నడిపించేవి తప్ప ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోమనేవి కావు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని మనసులో భక్తిని వుంచుకుని ఏ దేవుడిని పూజించినా,ఎక్కడ వుండి పూజించినా ముక్తి లభిస్తుంది. 

అసలు ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకింత క్రేజీ అయిపోయింది? ఇందులో ఆలయాల నిర్వాహకులు, పాలక మండళ్ళ ప్రచార ఆర్భాటాలు, ముక్తి మార్గం అంటూ చెప్పే ప్రవచనాలే కారణమనే వాదన వినిపిస్తోంది. కాబట్టి ఇప్పటినుండి అయినా భక్తులను సన్మార్గంలో నడిపేలా ప్రవచనాలు చెప్పాలి అంతేకాని మూడభక్తిని పెంచేలా వుండకూడదని కొందరు కోరుతున్నారు. ప్రజలు కూడా ఆ దేవుడిపై మనసులో భక్తిని పెంచుకోవాలి కానీ ఇలా అందరికీ తమలోని భక్తిని చూపించాలని ప్రాణాలమీదకు తెచ్చుకోవడం మంచిందికాదు. 
 

Latest Videos

click me!