తిరుపతి తొక్కిసలాట.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
దర్శనం టోకెన్ల జారీ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. పిల్లలు, వృద్ధులతో సహా చాలా మంది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. పోలీసులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల సంఖ్యపై టీటీడీ సరైన అంచనాలతో ఏర్పాట్లు చేయకపోవడం కూడా తొక్కిసలాటకు కారణంగా ఉంది.
సీఎం చంద్రబాబుకు నివేదిక
తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ తర్వాత డీఎస్పీ సరిగా స్పందించలేదనీ, ఎస్పీ సిబ్బందితో వచ్చి వెంటనే భక్తులకు సాయం చేసినట్టు సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే, అంబులెన్స్ డ్రైవర్ తీరును కూడా ఇందులో ప్రస్తావించారు. అంబులెన్స్ ను డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లినట్లు, ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అతను అందుబాటులో రాలేదని నివేదిక పేర్కొంది.