ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేవు. వేసవి ఆరంభంనుండి ఓవైపు ఎండలు పెరుగుతూనే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజులు ఆ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
IMD Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవికాలం కావడంతో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి... ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి.
26
ఏపీలో భారీ వర్షాలు
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (ఏప్రిల్ 6, సోమవారం) పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ (మంగళవారం, 7 ఏప్రిల్) కూడా వర్షాలు కొనసాగుతాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్నిప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో ఈ వర్షాలు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరించింది.
36
ఏపీలో మండుటెండలు
వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎండల తీవ్రత తగ్గుతుందని భావిస్తే పొరబడినట్లే. దేని లెక్క దానిదే అన్నట్లుగా వాతావరణ పరిస్థితులున్నాయి... ఎండలు కూడా మండిపోతున్నాయి. ఇవాళ (మంగళవారం) నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు... తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... వడగాలుల ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది.
సోమవారం (ఏప్రిల్ 6న) అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో అత్యధికంగా 42°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక కడప జిల్లా రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 40.7°C, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6°C, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ జోరువానలు, మండుటెండలు కొనసాగుతున్నాయి.
56
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ ఏపీలో మాదిరిగానే వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు మండే ఎండలు, మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ (మంగళవారం) కూడా తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
66
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్
ఇదే సమయంలో తెలంగాణలో ఎండలు మండిపోతాయని... 36 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అయితే ఏప్రిల్ 10 నుండి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నార్త్, ఈస్ట్ తెలంగాణలో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని... సింగరేణి, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందట. హైదరాబాద్ లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఇలా అసలు సిసలైన సమ్మర్ మొదలవబోతోందన్నమాట.