Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మరుస్తుండటంతో ఏపీకి ముప్పు పొంచివుంది. గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలకు హెచ్చరికలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరో తుపాను గండం పొంచివుందని ఐఎండీ హెచ్చరించింది. ఇటీవల వచ్చిన తుపానుల కారణంగా దెబ్బతిన్న క్రమంలో మరో తుపాను హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్ర తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
25
తుపానుగా రూపాంతరం చెందుతున్న వాయుగుండం
వాతావరణ విభాగం అంచనాల ప్రకారం, ఆదివారం వాయుగుండంగా మారనున్న ఈ వ్యవస్థ.. ఉత్తర వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత సోమవారం సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. బుధవారం నాటికి ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
35
ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం.. భారీ వర్షాలు
ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికే సముద్రంలో ఉన్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి చేరుకోవాలని సూచించారు. బలమైన గాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్స్ దగ్గర నిల్చోవద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
55
తెలంగాణలో వాతావరణం ఎలా వుంది?
ఈ తుపాను గమనాన్ని బట్టి తెలంగాణపై కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. నవంబర్ 19, 20 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోందని, ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని గమనించాలని సూచించారు. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపతున్నాయి. చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరన శాఖ ప్రజలను అలర్ట్ చేసింది.