బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

Published : Nov 14, 2026, 06:42 AM IST

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

PREV
14
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వాతావరణ వ్యవస్థ క్రమంగా వాయవ్య దిశగా కదులుతోంది. శనివారం నాటికి ఇది మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశాలున్నాయని వివరించారు.

24
ఆదివారం నుంచి సముద్రంలో అలజడి..

అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి సముద్ర పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చని సూచించారు. దీంతో మత్స్యకారులు ఆదివారం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు. తుపాను ప్రభావంపై మరింత స్పష్టత వచ్చే వరకు మత్స్యకారులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

34
ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర వైపు తుపాను పయనం?

ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర తీర ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే ఈ వ్యవస్థ ప్రయాణించే ఖచ్చితమైన దిశ, అది ఎంత తీవ్రతతో తుపానుగా బలపడుతుంది, ఏ ప్రాంతంలో తీరం దాటుతుంది అనే అంశాలపై ప్రస్తుతం పూర్తి స్పష్టత లేదని వెల్లడించారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు. అందువల్ల తీర ప్రాంత ప్రజలు తాజా వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

44
వదంతులు నమ్మొద్దు.. అధికారిక సమాచారాన్నే న‌మ్మండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించిన పరిణామాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషించి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తుపానుకు సంబంధించి ప్రచారమవుతున్న నిర్ధారణ లేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు. తుపాను కదలికలు, ప్రభావిత ప్రాంతాలపై స్పష్టత వచ్చిన వెంటనే తదుపరి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories