Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఫిల్మ్ న‌గ‌ర్‌.. విశాఖ సీఐఐ స‌ద‌స్సులో కీల‌క చ‌ర్చ‌

Published : Nov 13, 2026, 08:22 PM IST

Andhra Pradesh: విశాఖను వినోద రంగానికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని నటుడు రానా దగ్గుబాటి తెలిపారు. సినీ పరిశ్రమతో పాటు డిజిటల్ క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని సీఐఐ సదస్సు2026లో వెల్లడించారు

PREV
15
హైదరాబాద్ తరహా సినీ అభివృద్ధి ఏపీలోనూ సాధ్యం

తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఎదగడం వెనుక పటిష్ఠమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం ఉన్నాయని రానా అభిప్రాయపడ్డారు. ఇదే తరహా అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన ప్రణాళికలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే రాష్ట్రంలో వినోద రంగం గణనీయంగా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం సినీ పరిశ్రమకు అనువైన కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు.

25
విశాఖలో ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ ఏర్పాటుకు సహకారం

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణంతో పాటు ఇతర వినోద రంగాలకు కూడా అవకాశాలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని రానా ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని స్పష్టం చేశారు. కేవలం సినిమా షూటింగ్‌లకే పరిమితం కాకుండా, నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, కొత్త దర్శకులు, కంటెంట్ క్రియేటర్లకు అవసరమైన వసతులు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈ తరహా అభివృద్ధి వల్ల విశాఖపట్నంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు స్థానిక యువతకు వినోద పరిశ్రమలో రాణించే అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

35
ప్రతి మొబైల్ ఫోన్ ఒక ప్రొడక్షన్ స్టూడియోనే

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంటెంట్ తయారీ విధానం పూర్తిగా మారిపోయిందని రానా వివరించారు. గతంలో సినిమా లేదా వీడియో రూపొందించాలంటే ప్రత్యేకమైన కెమెరాలు, స్టూడియోలు, భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ప్రస్తుతం సాధారణ స్మార్ట్‌ఫోన్‌తోనే నాణ్యమైన కంటెంట్ సృష్టించే పరిస్థితి వచ్చిందన్నారు. నేటి యువత చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఒక ప్రొడక్షన్ డివైజ్‌గా మారిందని పేర్కొన్నారు. యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్న యువ ఫిల్మ్ మేకర్స్, స్వతంత్ర సృజనకారులు పెద్ద నిర్మాణ సంస్థలకు దీటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని తెలిపారు.

45
క్రియేటర్ ఎకానమీతో యువతకు కొత్త అవకాశాలు

భవిష్యత్తులో డిజిటల్ కంటెంట్ సృష్టి ఒక పెద్ద ఆర్థిక రంగంగా మారనుందని రానా అభిప్రాయపడ్డారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. సృజనాత్మకతను వ్యాపారంగా మార్చుకునే యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కొత్త ఆర్థిక మార్పునకు విశాఖపట్నం వేదిక కావాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయాలని సూచించారు.

55
వైజాగ్‌లో హైదరాబాద్ తరహా ఎకో సిస్టమ్: నారా లోకేశ్

రానా ప్రతిపాదనలపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడిన తరహాలోనే విశాఖపట్నంలోనూ అనుకూలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తామని తెలిపారు. సినిమా నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సాహకాలు అందిస్తోందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో క్రియేటర్ ఎకానమీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రంగాల్లో ఒకటిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త ఎదగాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories