ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సెలవులు ప్రారంభయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఆంధ్ర ప్రదేశ్ కు పయనం అయ్యారు. దీంతో హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే రహదారులు వాహనాలతో నిండిపోయాయి... బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.
ఇలా సొంతూళ్లకు వెళ్లి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకోవడానికి తెలుగు ప్రజలు సిద్దమయ్యారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ బాంబు పేల్చింది. సంక్రాంతి పండగ సమయంలో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే రెండుమూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనవరి 12, 13 (ఆది, సోమవారం) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలకు వర్షసూచన వుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇలా సంక్రాంతి పండగ సమయంలో ఏపీలోకి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని... మిగతాప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లగా వుంటుందని తెలిపారు. దీంతో సంక్రాంతి వేడుకలకు ఈ వర్షాలు ఎక్కడ ఆటంకం కలిగిస్తాయోనని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని రైతులు కూడా మళ్లీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కంగారు పడుతున్నారు.