Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) ఏఐ టెక్నాలజీని వినియోగించనుంది. భక్తుల దర్శన అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అత్యాధునిక టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) జె. శ్యామలారావు గురువారం ప్రకటన చేశారు.
ఈవో వెల్లడించిన వివరాల ప్రకారం, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విధానాలను ఉపయోగించి భక్తులను ధృవీకరించనున్నారు. దాంతో పాటు, దొంగ పాస్‌లను, భక్తుల పేర్లను వాడి జరిగే మోసాలను నిరోధించడమే లక్ష్యంగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంటోంది.
25
తిరుమలలో అత్యుత్తమ టెక్నాలజీని వాడుతాం : టీటీడీ
“టీటీడీ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీ పరిష్కారాలను, ముఖ్యంగా AI ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భక్తుల యాత్రను మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని శ్యామలారావు పేర్కొన్నారు.
35
తిరుమలలో నకిలీ టిక్కెట్లు, బుకింగ్ మోసాలకు చెక్ పెట్టే చర్యలు
ఈ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా భక్తులకు సమయానుకూల దర్శన టోకెన్లు జారీ చేయబడతాయి. ప్రతి భక్తుని ముఖ చిత్రం తీసి, గత 30 రోజుల్లో సేకరించిన దాదాపు 10 లక్షల చిత్రాలతో అనుసంధానం చేసి, నకిలీ బుకింగ్‌లను అడ్డుకుంటారు.
ఈ విధానం ద్వారా టోకెన్ జారీ, ధృవీకరణ ప్రక్రియ వేగంగా, సమస్యలులేకుండా పూర్తవుతుంది. దీంతో నకీలీ టిక్కెట్లు, బుకింగ్ మోసాలకు పూర్తిగా చెక్ పడుతుంది.
ముఖ గుర్తింపు టెక్నాలజీని క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, ఆలయ అంతర్గత ప్రాంతాల్లో భక్తుల సంఖ్యను గమనించడానికి కూడా ఉపయోగిస్తారు. AI ఆధారిత కెమెరాలు భక్తుల కదలికలను రియల్ టైంలో గుర్తించి, దర్శన సమయాన్ని అంచనా వేసేందుకు సహాయపడతాయి.
“ఈ విధానం ద్వారా భక్తులు క్యూ లైన్‌లో చేరినప్పుడు తగిన సమాచారం పొందవచ్చు. వారు తమ యాత్రను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు” అని ఈవో తెలిపారు.
55
శ్రీవారి భక్తుల సేవల్లో పారదర్శకత, సమర్థత, భద్రతను పెంచే చర్యలు
అలాగే, AI కెమెరాల ద్వారా దర్శన మార్గాల్లో అనవసర ఖాళీలు లేదా ఆపరేషనల్ లోపాలను గుర్తించి సరిచేయవచ్చు. భవిష్యత్‌లో తిరుమలలో చొరబాటుదారులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కీలకంగా ఉపయోగపడనుంది. మొత్తంగా, శ్రీవారి భక్తుల సేవల్లో పారదర్శకత, సమర్థత, భద్రతను పెంచే లక్ష్యంతో ఈ టెక్నాలజీని అన్ని విభాగాల్లో విస్తరించనుంది.