TTD: కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళలు ఫ్రీ టికెట్‌తో ప్రయాణాలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం తిరుమలకు మాత్రం వర్తించదని అధికారికంగా ప్రకటించారు. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ స్కీమ్ అమలు చేయబోమని తిరుమల డిపో అధికారులు స్పష్టంచేశారు. అంటే కొండపైకి వెళ్లాలంటే తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ నిర్ణయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని ఆర్టీసీ తెలిపింది. దీంతో తిరుమలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర మహిళలకు నిరాశ తప్పలేదు.
26
తిరుమల మినహాయింపు
ఆగస్టు 15న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఘనంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ప్రత్యేక టికెట్ ఇస్తూ ఈ పథకాన్ని అధికారికంగా ఆరంభించారు. అనంతరం ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమలవుతున్నా తిరుమల మార్గం మాత్రం మినహాయించడం గమనార్హం. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
36
తిరుమలలో భక్తుల రద్దీ
ఇదిలా ఉంటే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 77,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు చేరింది. ప్రస్తుతం ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తుల క్యూ లైన్లు సాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం చేసుకోవాలంటే దాదాపు 48 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని టిటిడి ప్రకటించింది.
కొండపై భక్తులకు అందుబాటులో ఉన్న 7,500 గదులు, నాలుగు పీఏసీ సెంటర్లు సరిపోకపోవడంతో వసతి కోసం భక్తులు కష్టాలు పడుతున్నారు. వరుస సెలవులు, వారాంతం కారణంగా రద్దీ మరింత పెరగవచ్చని టిటిడి అంచనా వేస్తోంది. రోజుకు గంటకు సగటున 4,500 మందికి మాత్రమే దర్శనం కల్పించగలుగుతున్న కారణంగా భక్తులు రెండు రోజులపాటు క్యూ లైన్లలో గడపాల్సి వస్తోంది.
56
సౌకర్యాలపై టిటిడి ప్రయత్నాలు
క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్న, పానీయాలు, తాగునీటి సదుపాయాలను నిరంతరం అందిస్తున్నామని టిటిడి అధికారులు చెబుతున్నారు. అయితే, వసతి సదుపాయాల కొరత, టికెట్ కౌంటర్ల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల విషయంలో సమయానికి కేటాయింపులు జరగకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది.
66
భక్తులకు విజ్ఞప్తి
తిరుమలలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో దర్శనానికి వచ్చిన భక్తులు సహనం పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఆలయ ముందు మాడవీధుల వరకు భక్తులు నిలిచి ఉండటంతో రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. వర్షం కారణంగా ఇబ్బందులు మరింత పెరిగినా, టిటిడి తరఫున అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.