
Tirumala : గేమ్స్ అంటే ఒకప్పుడు ఆరోగ్యాన్ని పెంచేవి... సరదాను పంచేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా ఆన్ లైన్ గేమ్స్... పబ్జీ, ఫ్రీ పైర్, లూడో వంటి గేమ్స్ కు ప్రజలు మరీముఖ్యంగా యువత బాగా ఆకర్షితం అవుతున్నారు. పిల్లల చేతికి సెల్ ఫోన్ వచ్చాక ఈ ఆన్ లైన్ గేమ్స్ కల్చర్ విపరీతంగా పెరిగింది. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే మనిషి ప్రతి భావోద్వేగాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ గేమింగ్ కంపనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా తాజాగా ప్రజలకు దేవుడిపై ఉండే భక్తిని వాడుకుంటున్నాయి కొన్ని గేమింగ్ సంస్థలు.
భారతదేశంలోనే ప్రముఖ దేవాలయం తిరుమల. హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయమిది. రోజూ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుండేకాదు దేశ నలుమూలల నుండి లక్షలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారు... మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా ఆ దేవుడు కొలువైన ఏడుకొండలను భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ తిరుమల ఆలయ పవిత్రతను, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయంలో వీడియోలు, పోటోలు తీసుకోడానికి అనుమతి లేదు. తిరుమల పైనుండి ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరకుండా జాగ్రత్తలు తీసుకుంటారంటేనే భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు... ఇప్పటికే తిరుమలను నో ప్లై జోన్ గా ప్రకటించాలని టిటిడి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా ఆలయ భద్రత విషయంలో టిటిడి బోర్డు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే ఓ ఆన్ లైన్ గేమింగ్ కంపనీ మాత్రం ఏకంగా తిరుమల ఆలయంపై ఓ వీడియో గేమ్ నే సృష్టించింది. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
తిరుమల యాత్ర మెజారిటీ హిందువుల కల... తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామి దర్శించుకుంటే జీవితం ధన్యం అవుతుందని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు లక్షలాది మంది శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇలా ప్రజల్లో శ్రీవారిపై భక్తిని తమ బిజినెస్ కు పెట్టుబడిగా మార్చుకుంది ప్రముఖ గేమింగ్ కంపనీ Roblox (రోబ్లాక్స్).
తిరుమల ఆలయంలో వీడియోలు, ఫోటోలు తీసుకోవడం నిషేధం.. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు సెల్ ఫోన్, కెమెరా వంటి ఎలక్ట్రిక్ వస్తువులు అనుమతించరు. అలాంటిది ఈ రోబ్లాక్స్ కంపనీ వీడియోగేమ్ లో తిరుపతి నుండి తిరుమలకు ప్రయాణంపై వీడియో గేమ్ రూపొందించింది. ప్రధాన ఆలయ అంతర్భాగంలో అంటే వైకుంఠ క్యూకాంప్లెక్స్ నుండి స్వామివారిని దర్శించుకునేవరకు ఈ గేమ్ సాగుతుంది. అంటే ఈ గేమ్ ఆడేవారికి వర్చువల్ గా తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని కల్పించాలన్నది గేమర్స్ ఉద్దేశం కావచ్చు.
ఈ గేమ్ ఆడేవారినుండి రోబ్లాక్స్ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేస్తోందట. శ్రీవారిపై ప్రజల్లోని భక్తిని ఆసరాగా చేసుకుని గేమ్ రూపొందించి ఆన్ లైన్ లో డాలర్ల రూపంలో డబ్బుల తీసుకుంటున్నట్లు టిటిడికి ఫిర్యాదు అందాయి. దీంతో ఈ గేమ్ వివాదాస్పదంగా మారింది.
అయితే తిరుమల పవిత్ర, భద్రతను దెబ్బతీసేలా ఈ గేమ్ ఉండటంతో వివాదం మరింత ముదిరింది. ఈ గేమ్ ద్వారా తిరుమల ఆలయ అంతర్భాగాన్నిచూపించడం వివాదానికి ప్రధాన కారణం. దీంతో రోబ్లాక్స్ తిరుమల యాత్రపై రూపొందించిన గేమ్ పై టిటిడికి ఫిర్యాదు అందాయి.
తమ ఆదాయం కోసం పవిత్రమైన తిరుమల ఆలయ భద్రతకు ముప్పు కలిగించేలా Roblox గేమింగ్ సంస్థ వ్యవహరిస్తోందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. శ్రీవారి ఆలయ అంతర్భాగంలోని దృశ్యాలతో వీడియో గేమ్ లో చూపించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయమేనని ఆయన అన్నాడు. అందుకే వెంటనే ఈ గేమ్ ను నిలిపేలా తిరుమల తిరుపతి దేవస్థాన్ ట్రస్ట్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ కోరారు. ఈ మేరకు టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఈ గేమ్ గురించి వివరించి ఫిర్యాదు చేాశారు.
తిరుమల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టమని టిటిడి ఛైర్మన్ హెచ్చరించారు. దైవభక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని... దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుమల విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు.