పేదోడి ఇంటి కంటే రుషికొండ ప్యాలెస్ లో బాత్రూమే పెద్దది... బట్టబయలైన రాజప్రాసాదం రహస్యాలివే...

First Published Jun 17, 2024, 6:45 PM IST

విశాలమైన, విలాసవంతమైన గదులు..  లక్షల ఖరీదైన ఫర్నీచర్.. కళ్లు మిరిమిట్లు గొలిపే ఇంటీరియర్ డెకరేషన్.. పేదలు ఉండే ఇల్లంత బాత్ రూమ్.. ఇలా ఎన్నో ఆధునిక హంగులతో విశాఖ రుషికొండపై భవనాలు వెలిశాయి. గత ప్రభుత్వం రహస్యంగా ఉంచిన ఈ భవనాలు... ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. రుషికొండ భవనాలపై మీడియా, సోషల్ మీడియాలో ఇప్పుడు మామూలు రచ్చ జరగడం లేదు. 

vizag

విశాఖపట్నం. వైజాగ్ అని పిలుచుకునే మహా నగరం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమిది. అందమైన సముద్ర తీరం దీనికి ఎంతో ప్రత్యేకం. సముద్రం ఒడ్డున ఉన్న నగరం కావడంతో పాటు అనేక ప్రత్యేకతలు, చరిత్ర ఉండటంతో ఏడాదంతా వైజాగ్‌కి పర్యాటకులు క్యూ కడుతూనే ఉంటారు. 
 

vizag

ఇండియన్ నేవీకి చెందిన తూర్పు నౌకాదళం కార్యకలాపాలు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయి. దీంతో దేశ రక్షణలో విశాఖకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నేవీ కార్యకలాపాలతో పాటు ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు.... ఇలా ప్రముఖులు తాకిడి కూడా విశాఖకు ఎక్కువే అని చెప్పారు. 
 

ఇంత ప్రాధాన్యమున్న విశాఖను ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. అయితే, గత ప్రభుత్వం విశాఖలో చేపట్టిన కొన్ని కట్టడాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా రుషికొండపై రాజ ప్రాసాదాలను తలపించేలా చేపట్టిన భారీ నిర్మాణాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. గత ప్రభుత్వం ఆ భవనాల వైపుగానీ, ఆ దారిలోగానీ ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకోవడం, రహస్యంగా, టైట్‌ సెక్యూరిటీ నడుమ నిర్మాణాలు చేపట్టడం కూడా విమర్శలకు తావిచ్చింది. 
 

rushikonda

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ ఓడిపోవడం, టీడీపీ కూటమి గెలవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ చేసిన ఒక్కో పనిలో తప్పుల్ని వెతకడం ప్రారంభించింది ప్రస్తుత ప్రభుత్వం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులు, మీడియాతో కలిసి రుషి కొండ భవనాలను సందర్శించడంతో గుట్టు అంతా రట్టయింది. వందల కోట్లతో విలాసవంతంగా నిర్మించిన భవనాల గుట్టు అంతా బయట పడింది.

ఇప్పుడు సోషల్‌ మీడియా, మీడియాలో చర్చంతా రుషికొండ భవనాలపైనే జరుగుతోంది. అంతంత భారీ ఖర్చుతో భవనాలు ఎందుకు కట్టినట్లు..? ప్రభుత్వ భవనాలైతే ఏ ఉద్దేశంతో ఇన్ని రోజులు రహస్యంగా ఉంచారు..? ప్రారంభోత్సవం కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటి..? ఒకవేళ ప్రభుత్వ భవనాలే అయితే ఎవరి కోసం ఆ భవనాలు నిర్మించినట్లు...?... ఇలా అనేక ప్రశ్నలు రుషికొండ విల్లాల విషయంలో వినిపిస్తున్నాయి. 
 

విశాఖ రుషికొండపై గతంలో టూరిజంకు చెందిన భవనాలు ఉన్నాయి. అయితే, వాటికి ఏమైందో తెలియదు గానీ, కొత్తగా భారీ స్థాయిలో విలాసవంతమైన భవనాలు నిర్మించేసింది గత జగన్‌ ప్రభుత్వం. ఆ సువిశాల, అత్యంత విలాసవంతమైన భవంతులను చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు సెంటు భూమి ఇచ్చిన ప్రభుత్వం... తాత్కాలికంగా ఉండేందుకు భారీ రాజ ప్రాసాదాలే నిర్మించుకుందా అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తెల్లగా మెరిసిపోతున్న ప్యాలెస్‌లో పేద్ద ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడకగదులు, అంతకు మించిన లగ్జరీగా స్నానాల గదులు, రూ.లక్షల విలువైన మంచాలు, పరుపులు, బాత్‌ టబ్‌లు, షాండ్లియర్లు... ఇలా అడుగడుగునా అంతా రాజవైభోగమే తాండవం చేస్తోంది. 
 

నిర్మాణాలు, వ్యయం ఇలా...

రుషికొండపై జగన్‌ ప్రభుత్వం నిర్మించిన భవనాలు రాజకోటను తలపిస్తున్నాయి. 
లక్షా 41వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించారు. 
ప్యాలెస్‌లను తలదన్నేలా భవనాల లోపల, వెలుపల నిర్మాణాలు చేపట్టారు. 
అత్యంత ఖరీదైన మార్బుల్స్, గ్లాస్‌ ఫర్నీచర్‌తో కళ్లు జిగేల్‌మనేలా భవనాలు ఉన్నాయి. 
దాదాపు రూ.500 కోట్లతో 7 విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు నిర్మించారు.  
ఏడింటిలో 3 ప్రత్యేక నివాస భవనాలు, 12 బెడ్‌రూములు ఉన్నాయి. 
ప్రతి బెడ్‌ రూమ్‌కి సుపర్‌ లగ్జీరియస్‌గా నిర్మించిన అటాచ్డ్‌ బాత్‌ రూమ్‌లు ఉన్నాయి. 
ఆ స్నానపు గదులు పేదల ఇళ్లకోసం జగన్‌ ప్రభుత్వం స్థలం కంటే పెద్దగా ఉన్నాయి. 
స్నానపు గది వైశాల్యం దాదాపు 480 చదరపు అడుగులు ఉంది. 
ఇంటీరియర్‌ డెకరేషన్‌ కోసమే 1300 రకాలకు పైగా వస్తువులు వినియోగించారు. 
భవనాలన్నీ ఒక ఎత్తుయితే బయట ఏర్పాట్లు మరో ఎత్తు. 
ఖరీదైన పచ్చికతో సువిశాలమైన లాన్లు, పార్కులు భవనాల వెలుపల తీర్చిదిద్దారు.

మరికొన్ని ప్రశ్నలు...

జగన్‌ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను ఆర్థిక రాజధానిగా అనౌన్స్‌ చేసింది. ఇక రేపో మాపో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తరలిపోతుందన్నట్లే గత ఐదేళ్లూ హడావుడి చేశారు. ఇదిగో.. రాబోయే దసరాకు సీఎం జగన్‌ విశాఖకు తరలివెళ్తారు. లేదు లేదు వచ్చే సంక్రాంతికి పక్కాగా జగన్‌ విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారు. తూచ్‌.. వచ్చే కొత్త ఏడాది నుంచే విశాఖకు సీఎం మకాం మార్చేస్తారు. ఇలా 2019 నుంచి 2024 మధ్య అనేక మార్లు పత్రికల్లో మంత్రులు, వైసీపీ నేతల ప్రకటనలు దర్శనమిచ్చాయి. అంత అత్యవసరంగా జగన్‌ విశాఖకు తరలిపోయి చేసేది ఏంటంట అన్న చిరాకు కూడా ప్రజల్లో కనిపించింది. 

సీఎం కోసమే అయితే, అంత డొంక తిరుగుడుగా రుషికొండ భవనాల గురించి వ్యవహరించడం ఎందుకు? రుషికొండపై కట్టేది టూరిజం రిసార్టు అని వైసీపీ నాయకులు, మంత్రులు చెప్పుకొచ్చారు. ప్రారంభోత్సవం కూడా గుట్టుగానే చేశారు. అలాగే, రిసార్టు కోసమే అయితే విశాలమైన ఆఫీసులాంటి గదులు ఎందుకు? 7వేల 266 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కార్యాలయ భవనాలు కట్టాల్సిన అవసరం ఏంటి? 

చివరగా... 
రుషికొండపై భవనాలకు అంచనా వ్యయం రూ.452 కోట్లు. 
ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.407 కోట్లు 
వరండాల్లో అమర్చిన షాండ్లియర్‌ ఖరీదే రూ.2 లక్షలు. అలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి.
ఇంటీరియర్‌ డెకరేషన్‌ కోసం వినియోగించిన వస్తువులు, ఫర్నిచర్‌ ఖరీదు రూ.33 కోట్లు 
రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధికి రూ.50 కోట్లు 
ఆరుబయట ల్యాండ్‌స్కేపింగ్‌, పార్కులో వాకింగ్‌ ట్రాక్‌ మరింత అదనపు ఖర్చు
బాత్‌ టబ్‌ ఖర్చు రూ.35 లక్షలు. 

గతంలో రోడ్లు వేయమని ప్రజలెవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులను అడిగితే.. డబ్బంతా సంక్షేమానికి ఖర్చయిపోతోందని.. ఇంక నిధులెక్కడివని సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే అయితే, ఒక నెల పింఛను తీసుకోవడం మానేస్తే రోడ్లు వేయొచ్చని సమాధానమిచ్చి.. షాక్‌కి గురిచేశాడు. మరి రోడ్లు వేయడానికి లేని నిధులు.. ఇలా ప్యాలెస్‌లు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ అమాత్యులకు, వారికి సహకరించిన అధికారులకే తెలియాలి.

Latest Videos

click me!