
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు పొడిగా ఉన్న వెదర్ ఇప్పుడు పూర్తిగా కూల్ అండ్ క్లౌడీగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణికి తోడు, మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు వానలు, మరోవైపు పొగమంచు, ఆ వెంటనే వణికించే చలి గాలులతో రెండు రాష్ట్రాల్లో వెదర్ చాలా వింతగా మారబోతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బుధవారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.
విశాఖపట్నం, అనకాపల్లితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. కాగా, మంగళవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 3.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొత్తపట్నం, కావలిలో 3.4 సెం.మీ, మారెళ్లలో 3.3, త్రిపురాంతకం, నెల్లూరులో 2.7, ములుకుదురులో 2.6, నెల్లూరు రూరల్‌లో 2.5 సెం.మీ వర్షం కురిసింది.
ఏపీలో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°C గా ఉండే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం 65 శాతం వరకు ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
తీర ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు, రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని APSDMA మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ ప్రత్యేకంగా సూచించారు.
నవంబర్ 25 నుంచి 27 వరకు తెలంగాణలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'తెలంగాణ వెదర్‌మ్యాన్' బాలాజీ కూడా అంచనా వేశారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°C గా ఉండొచ్చు. ఆ తర్వాత రెండు రోజులు కూడా అక్కడక్కడ చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది.
ఇక వర్షాలు తగ్గిన వెంటనే అసలైన వింటర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 మధ్య శీతల గాలులు వీస్తాయి. ఇప్పటికే సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 15.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజులు రాత్రి పూట ఉష్ణోగ్రతలు 17.3 నుంచి 20 డిగ్రీల మధ్య ఉండనున్నాయి.
హైదరాబాద్ వాసులకు బుధవారం వాతావరణం చాలా ప్లెజెంట్‌గా ఉండబోతోంది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై, చల్లని వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారుజామున సిటీలో 22°C ఉష్ణోగ్రత నమోదు కాగా, గాలిలో తేమ 91 శాతంగా ఉంది. పగటిపూట గరిష్ఠంగా 29°C వరకు ఉష్ణోగ్రత వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత సీన్ మారబోతోంది.
సాయంత్రం వరకు నగరంలో తేలికపాటి వర్షం లేదా చిరుజల్లులు పడే అవకాశం 55 శాతం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 7 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నందున, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు, వాహనదారులు సాయంత్రం వేళల్లో కాస్త అలర్ట్‌గా ఉండటం బెటర్.
వాతావరణంలో వస్తున్న ఈ సడన్ మార్పుల వల్ల ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పొగమంచు వల్ల రోడ్లపై విజిబిలిటీ బాగా తగ్గిపోతుంది. కాబట్టి తెల్లవారుజామున హైవేలపై ప్రయాణించే వాహనదారులు, ట్రావెలర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.