పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ సీరియస్

Published : Nov 12, 2025, 09:23 PM IST

Mangalampeta : మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించారు.

PREV
15
అటవీ భూముల ఆక్రమణ: పవన్ కళ్యాణ్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవణ్ కళ్యాణ్ అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఆక్రమణలపై హెచ్చరికలు చేశారు. ఇటీవల మంగళంపేటలో జరిగిన భూఆక్రమణలపై విజిలెన్స్ నివేదికలను సమీక్షిస్తూ, ఎవరి చేతుల్లో ఎంత అటవీ భూమి ఉందో ప్రజల ముందుంచాలని ఆయన ఆదేశించారు.

“అటవీ భూములు జాతికి చెందిన ఆస్తి. వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని అతిక్రమించడం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అన్ని ఆక్రమణ వివరాలు అంటే కేసులు, స్థితిగతులు, కోర్టు విచారణలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

25
మంగళంపేట ఆక్రమణల కేంద్రంగా మాజీ మంత్రి కుటుంబం

చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 104 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, “ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే” అని అన్నారు. తప్పకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన విజిలెన్స్ నివేదికను ప్రాతిపదికగా తీసుకొని, కేసులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవాలని, ఆక్రమణల తొలగింపుపై సమీక్ష చేయాలని ఆదేశించారు.

35
అడవుల్లో వారసత్వ భూములు ఎలా?

పవన్ కళ్యాణ్ చేసిన సమీక్షలో అత్యంత ముఖ్యమైన అంశం “అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి?” అన్న ప్రశ్నను ఎత్తి చూపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అడవి మధ్యలో ఉన్న భూమిని వారసత్వ భూమిగా పేర్కొనడం పట్ల పవన్ కళ్యాణ్ ప్రశ్నలు లేవనెత్తారు.

భూమి అసలు సర్వే నంబర్లు 295, 296లో ఉందని, కానీ కాలక్రమంలో భూమి విస్తీర్ణం 45.80 ఎకరాల నుంచి 77.54 ఎకరాలకు పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో, వెబ్‌ల్యాండ్ నమోదులో అసమానతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తీర్ణం పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందో వివరాలతో రిపోర్టు సమర్పించాలన్నారు.

45
విజిలెన్స్ నివేదికలో కీలక వివరాలు

ప్రసార మాధ్యమాల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమణలపై కథనాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికలో భూఆక్రమణ వివరాలు, సరిహద్దు సవరణలు, భూసమీకరణల మార్పులు వంటి ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు.

విజిలెన్స్ రిపోర్టును ఆధారంగా తీసుకుని ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. “న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తాం. చట్టం కఠినంగా అమలవుతుంది” అని ఆయన హెచ్చరించారు.

55
రాజకీయాలకు అతీతంగా ప్రకృతి పరిరక్షణ

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ప్రకృతి సంపదను భావితరాలకు అందించడం మన బాధ్యత. రాజకీయాలకతీతంగా ప్రకృతిని కాపాడాలి” అన్నారు.

ప్రభుత్వం ఎవరికీ భయపడదని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని ఆయన చెప్పారు.

అటవీ శాఖ అధికారులు ధైర్యంగా ముందుకు సాగాలని, సమన్వయంతో పనిచేస్తే రాబోయే తరాలకు ప్రకృతి సంపద సురక్షితంగా చేరుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

కొంత కాలంగా మంగళంపేట అటవీ భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మాజీ మంత్రి కుటుంబం అడవుల్లో వారసత్వ భూమిగా చూపిన స్థలాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణ భవిష్యత్తులో కీలక పరిణామాలకు దారితీయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories