సినీ హీరో నుండి డిప్యూటీ సీఎం వరకు... పవన్ కల్యాణ్ ప్రయాణం
పవన్ కల్యాణ్ సినీ జీవితం అంత సక్సెస్ ఫుల్ గా ఏం సాగలేదు. ఆరంభంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ అద్భుత విజయాలు సాధించాయి. కానీ తర్వాత జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి... ఇలా దశాబ్దానికి పైగా అపజయాలు ఎదురైనా పవన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే పవన్ ను జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాలు సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి... వీటి తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు.
అన్న చిరంజీవి ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీ పెట్టడంతో అందులో పవన్ కీలకంగా వ్యవహరించారు. అయితే చిరంజీవి రాజకీయాలను వీడినా పవన్ మాత్రం వీడలేదు.. సొంతంగా జనసేన పార్టీ పెట్టి ముందుకు సాగారు. రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు... పదేళ్ళపాటు ఓపికగా ప్రజా సమస్యలపై పోరాడారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది... పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎం అయ్యారు.