విజయనగరం: విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో విజయనగరం జిల్లా ఆస్పత్రిలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, జిల్లా యంత్రాంగం ఆక్సిజన్ పైప్ లైన్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయిస్తున్నారు. ఈ పనులను స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఆక్సిజన్ సమస్యపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి స్పందించారు. కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడటమే కాదు వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని దృష్టికి కూడా సమస్యను తీసుకుని వెళ్ళానని తెలిపారు.
''ప్రస్తుతం ఐసియూ లో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీ లో ఇబ్బంది ఉంది. కాబట్టి ఐసియూలోని 15మందిని తక్షణమే వేరొక ఆసుపత్రికి తరలిస్తున్నాం. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదు. తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నాం. పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖ కు తరలించమని ఆళ్ల నాని ఆదేశించారు'' అని తెలిపారు.
''ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్యను కూడా పరిష్కరిస్తాం. విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాము'' అని ఉపముఖ్యమంత్రి శ్రీవాణి భరోసా ఇచ్చారు.