
NICE (Needy Illiterate Children Education) పేరుతో 2002లో ఏర్పాటైన ఈ సంస్థ రిజిస్టర్డ్ లాభాపేక్ష లేని సేవా సంస్థగా పనిచేస్తోంది. బాల కార్మికులు, వెట్టిచాకిరీకి గురైన పిల్లలు, పేదరికంతో చదువుకు దూరమైన చిన్నారులకు విద్య అందించడం ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతంలో CBSE అనుబంధంతో పూర్తిగా ఉచితంగా రెసిడెన్షియల్ విద్య అందిస్తున్న ప్రత్యేక పాఠశాలగా NICE గుర్తింపు పొందింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 140 మంది బాలురు, 60 మంది బాలికలు కలిపి 200 మందికి పైగా పిల్లలకు విద్యనభ్యసిస్తున్నారు. చదువుతో పాటు వారికి ఉచిత వసతి, పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో వరుసగా 16 సంవత్సరాల పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ఈ పాఠశాల ప్రత్యేకత. విద్యార్థులకు పుస్తకాల్లోని చదువుతో పాటు సాంకేతిక, వృత్తి విద్యలోనూ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జీవించేలా తీర్చిదిద్దుతున్నారు.
NICE స్కూల్ తన సేవలను పాఠశాల విద్యార్థులకే పరిమితం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పూర్ణచందర్ రావు నాయకత్వంలో ములుగు జిల్లాలోని యర్రపెంట గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. పేద కుటుంబాలకు ఆహారం, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. అలాగే గ్రామంలో 2,000కు పైగా పుస్తకాలతో కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మద్యపానం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ దాని వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. గ్రామాలు తమ అభివృద్ధికి తామే ముందడుగు వేసేలా ప్రోత్సహించడం NICE లక్ష్యంగా పెట్టుకుంది.
సామాజిక సేవలో భాగంగా NICE సంస్థ తాజాగా ములుగు జిల్లాలోని సారలమ్మ గుంపు, తక్కెడ గూడెం గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 90 పేద కుటుంబాలకు దుప్పట్లు, దోమతెరలను పంపిణీ చేసింది. చలికాలంలో పేద కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా దుప్పట్లు అందించడంతో పాటు దోమల నుంచి రక్షణ పొందేందుకు దోమతెరలను కూడా అందజేసింది. నిరుపేద కుటుంబాల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే వస్తువులను అందించడం ద్వారా సంస్థ తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. పిల్లల విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా NICE శ్రద్ధ చూపుతోంది. ఇలాంటి కార్యక్రమాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.
NICE స్కూల్ స్థాపకుడు పి. పూర్ణచంద్రరావు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన తన జీవితంలో ఎదురైన కష్టాలను, పేద పిల్లలు చదువు కొనసాగించేందుకు పడుతున్న ఇబ్బందులను దగ్గరగా చూశారు. ముఖ్యంగా అనాథలు, నిరుపేద పిల్లలకు సరైన విద్య, వసతి అందక వారి భవిష్యత్తు దెబ్బతినడం ఆయనను కలచివేసింది.
సామాజిక సేవా కార్యక్రమాల్లో కొన్నేళ్ల పాటు స్వచ్ఛందంగా పనిచేసిన ఆయన, కార్పొరేట్ రంగంలోనూ అనుభవం సంపాదించారు. ఈ అనుభవాల ద్వారా పేద ప్రజల అవసరాలు, వారికి నిరంతర సహాయం అందించాల్సిన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు.
ఈ ఆలోచనలతోనే 2002 మే నెలలో చిన్న ప్రయత్నంగా NICE స్కూల్‌ను ప్రారంభించారు. మొదట పరిమిత స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం క్రమంగా విస్తరించి, నేడు వందలాది మంది పిల్లలకు విద్య, భోజనం, వసతి, వైద్య సదుపాయాలు అందించే సంస్థగా ఎదిగింది. పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను కూడా విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఎంతోమంది నిరుపేద పిల్లలకు కొత్త జీవితంపై ఆశను కల్పిస్తోంది.
NICE సంస్థ తన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలు, విరాళాల వినియోగం విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రతి ఏడాది వార్షిక నివేదికలను విడుదల చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను 2024 ఏప్రిల్ 30న విడుదల చేసింది. కరోనా కష్టకాలంలోనూ 2020-21 వార్షిక నివేదికను ప్రచురించడం సంస్థ నిబద్ధతకు నిదర్శనం. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సంస్థ కార్యకలాపాలు, దాతల సహకారం, విద్యార్థులకు అందించిన సేవలు, సాధించిన ఫలితాలు, ఆడిట్ వివరాలను పొందుపరిచారు.
సమాజంలోని ప్రతి చిన్నారికి చదువుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో NICE ముందుకు సాగుతోంది. ఒకవైపు నిరుపేద పిల్లలకు ఉచిత విద్య, మరోవైపు గ్రామీణ కుటుంబాలకు ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధిపై అవగాహన కల్పిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారంతో మరింతమంది పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించాలనేది NICE ఆశయం.