
Naipunyam Job Portal : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకోసం సరికొత్త ప్రయోగం చేస్తోంది. యువతకు ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగాల్లో కూడా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. నౌకరీ, లింక్డిన్ వంటి జాబ్ పోర్టల్స్ మాదిరిగానే ప్రభుత్వమే 'నైపుణ్యం' పేరిట జాబ్ పోర్టల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ పోర్టల్ ను సిద్దం చేసి పరిశీలిస్తున్నారు... వచ్చేనెల సెప్టెంబర్ 1 నుండి ఇది అందుబాటులోకి వస్తుందని స్వయంగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ జాబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
'నైపుణ్య' జాబ్ పోర్టల్ కోసం నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. అక్కడ అధికారులు స్కిల్ సెన్సస్ నిర్వహించారు... అంటే ప్రజల్లోని నైపుణ్యాలను తెలుసుకుని ఢేటా సిద్దం చేశారు. వారి స్కిల్స్ ఆధారంగా కొన్నిరకాల రెజ్యూమ్స్ రెడీ చేశారు. వీటిని నైపుణ్యం పోర్టల్ లో ఉంచుతారు.. తద్వారా కంపెనీలు తమకు అవమసరమైన స్కిల్స్ కలిగినవారిని ఈజీగా ఎంపికచేసుకుంటాయి.
మంగళగిరిలో చేపట్టినట్లే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల స్కిల్స్ గుర్తించేపనిలో పడింది ప్రభుత్వం. నైపుణ్యం పోర్టల్ లో దరఖాస్తుదారులు తన వివరాలు, ఏ పనిలో స్కిల్ ఉంది, అనుభవం ఎంత? ఇలాంటి వివరాలను అందించాలి. ఈ పోర్టల్ ద్వారా కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలు కలిగినవారికి ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇలా ఈ నైపుణ్య జాబ్ పోర్టల్ ద్వారా అటు నిరుద్యోగులకు, ఇటు కంపెనీలకు లబ్ది కలుగుతుంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి (టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు) హామీ ఇచ్చారు. అందువల్లే అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది... మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా సిద్దమయ్యింది.
అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పిచేందుకు ప్రయత్నిస్తున్నారు... ఈ బాధ్యతను మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఆయన చొరవతో 'నైపుణ్య' జాబ్ పోర్టల్ సిద్దమయ్యింది... ఇది స్కిల్ లేబర్స్ కి అవకాశాలు కల్పిస్తుంది. వివిధ విభాగాల్లో నైఫుణ్యం కలిగివనవారు అంటే మెకానిక్లు, డ్రైవర్లు, పెయింటర్లు, ప్లంబర్లు వంటివారికి ఈ జాబ్ పోర్టల్ ద్వారా అవకాశాలు లభిస్తాయి.
జిల్లాలవారిగా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు... ఇందులో విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్ లెవెల్ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా అన్నిరకాల స్కిల్స్ కలిగినవారంతా ఒకే చోట లభిస్తారు... కాబట్టి కంపెనీలు కూడా ఈజీగా తమకు అవసరమున్న మేరకు స్కిల్ వర్కర్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.
ఇలా ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగకుండా కేవలం ఒక్క దరఖాస్తుతో వివిధ కంపెనీలకు వారి వివరాలు చేరతాయి. మొబైల్ నుండి కూడా నైపుణ్య జాబ్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. తద్వారా ఒక్క క్లిక్ తో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మాదిరిగా పనిచేస్తుందన్నమాట.
1. సాధారణంగా ఐటీ, కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలకోసం అంటే ఉన్నత చదువులు చదివినవారికి ఉద్యోగావకాశాల కోసం చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. కానీ చిన్నచిన్న వృత్తిదారులకు ఉద్యోగాన్వేషన చాలా కష్టం. ఇలాంటి వారికి ఈ నైపుణ్య జాబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈజీగా తమ ప్రొఫైల్ ను కంపెనీలకు చేరవేయవచ్చు.
2. కంపెనీలకు కూడా ఈ నైపుణ్య జాబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈజీగా తమకు అవసరమైన స్కిల్ వర్కర్స్ ను ఒకేచోట పొందవచ్చు.
3. ఈ జాబ్ పోర్టల్ లో నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకుంటారు... కాబట్టి ప్రభుత్వం వద్ద వీరికి సంబంధించిన ఢేటా ఉంటుంది. దీన్ని వివిధ పథకాల అమలుకోసం లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఉపయోగించుకోవచ్చు.
4. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగాలను ఎలా పొందాలి? అనేదానిపై పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ నైపుణ్య జాబ్ పోర్టల్ ను గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగితే మంచి ఫలితాలుంటాయి.
5. మొత్తంగా గ్రామీణ, పట్టణ యువతలకు ఈ నైపుణ్య జాబ్ పోర్టల్ ద్వారా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అలాగే పరిశ్రమలకు కూడా స్కిల్ వర్కర్స్ దొరుకుతారు కాబట్టి పనితీరు మరింత మెరుగుపడి అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
మంత్రి నారా లోకేష్ నైపుణ్యం జాబ్ పోర్టల్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. దీన్ని నిరుద్యోగ యువతకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్ గా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పటికే దీనిగురించి అధికారులతో పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై తగు సలహాలు, సూచనలిచ్చారు. యువతను, పరిశ్రమలను అనుసంధానం చేస్తూ మిషన్ మోడ్ లో ఈ నైపుణ్యం జాబ్ పోర్టల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ ఆదేశాలిచ్చారు.
నైపుణ్యం జాబ్ పోర్టల్ ను నిరుద్యోగ యువతకు పరిచయం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. యువత ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆ వివరాల ఆధారంగా రెజ్యూమ్ సిద్దమయ్యేలా చూడాలని సూచించారు. ప్రముఖ కంపెనీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని.. తద్వారా ఉద్యోగాలకోసం ఎదురుచూసేవారిని, ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నవారిని అనుసంధానం చేయవచ్చని నారా లోకేష్ పేర్కొన్నారు.