Mega DSC: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
1–8 తరగతులకు ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ ముఖ్యమైన అర్హతగా ఉందని అధికారులు తెలిపారు. OC/EWS అభ్యర్థులకు 60 శాతం, BCలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం కనీస ఉత్తీర్ణత మార్కులు ఉన్నాయని వివరించారు. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రత్యేక TET అర్హత అవసరం లేదన్నారు.
25
ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులపై వివరణ
కర్నూలుకు చెందిన ఎడిగా ప్రభాకర్ 2018లో టెట్ పేపర్-II-Bలో 77 మార్కులు సాధించినట్లు రికార్డుల్లో ఉందని అధికారులు తెలిపారు. ఈ అంశంపై విచారణ కొనసాగుతోందన్నారు. జంపాల ఉష 2012లో 79, 80 మార్కులు, 2017లో 76 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే మిరియాల గాయత్రి సాయి శ్రీ APTET–2024లో 97.89 మార్కులు, ప్రగడ కళ్యాణి APTET–2018లో 75 మార్కులు సాధించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయని తెలిపారు.
35
ఇతర అభ్యర్థుల టెట్ అర్హతలు
షేక్ నయాబ్ రసూల్, జక్కుల ఉదయలక్ష్మి, తాడిమర్రి మహమ్మద్ రఫీ, దేవరకొండ పవన్ కుమార్, తొగట చరణ్ రాజా తదితరులు తమకు వర్తించే TETలో అవసరమైన మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరుకు చెందిన వి. చక్రపాణి రెడ్డి ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీలో 60 మార్కులు అవసరం కాగా, APTET–2024లో 79.47 మార్కులు సాధించారని వివరించారు.
స్పోర్ట్స్ కోటా జాబితాను 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు ప్రచురించి, అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్లు SAAP అధికారులు తెలిపారు. జూడో సర్టిఫికెట్ల ప్రామాణికతపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. ఒకే మండలానికి చెందిన 21 మంది అభ్యర్థులు, వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారనే ఆరోపణలపై కూడా విచారణ పూర్తయ్యాకే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
55
ఇతర స్పోర్ట్స్ సర్టిఫికెట్లపైనా అధికారుల వివరణ
భర్త, భార్య ఇద్దరూ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అంశంలో వారు వేర్వేరు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద అప్పలరాజు విషయంలో మొదట తప్పుగా సోదరుడి సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసినా, తర్వాత తన నేషనల్ ఛాంపియన్‌షిప్ సర్టిఫికెట్‌ను సమర్పించినట్లు వివరించారు. కొనడ పద్మజకు సంబంధించిన అథ్లెటిక్స్ సర్టిఫికెట్‌ను అధికారిక రికార్డులు, సంబంధిత అసోసియేషన్ ధ్రువీకరణ ఆధారంగా చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించినట్లు తెలిపారు. సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లను కూడా సంబంధిత సంస్థల ధ్రువీకరణ ఆధారంగానే పరిశీలించినట్లు చెప్పారు. EWS కేటగిరీలో నియామకాలు సమర్థ అధికారి జారీ చేసిన అధికారిక సర్టిఫికెట్ల ఆధారంగా జరిగాయని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏదైనా సర్టిఫికెట్ నకిలీదని లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉందని విచారణలో తేలితే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.