అన్న, చెల్లి మ‌ధ్య‌లో ఓ ప్యాలెస్‌.. మ‌రో ట‌ర్న్ తీసుకున్న య‌ల‌హంక ప్యాలెస్ వ్య‌వ‌హారం

Published : Nov 22, 2026, 09:14 AM IST

Jagan Sharmila: యలహంక ప్యాలెస్‌ వివాదంలో వైఎస్‌ షర్మిలకు బెంగళూరులోని దేవనహళ్లి కోర్టు షాక్ ఇచ్చింది. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

PREV
14
సిలికాన్ బిల్డర్స్‌ తరఫున కోర్టులో పిటిషన్

యలహంక ప్యాలెస్‌లో షర్మిల జోక్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సిలికాన్ బిల్డర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు దేవనహళ్లి సీనియర్ సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టును ఆశ్రయించారు. ఈ సంస్థలో వైఎస్‌ జగన్‌ భార్య భారతి గతంలో డైరెక్టర్‌గా పనిచేశారు. 2017 ఫిబ్రవరి 16 వరకు ఆమె ఆ బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుతం రమేష్‌బాబుతో పాటు భారతి భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీలో డైరెక్టర్లుగా ఉన్నారు. షర్మిల ప్యాలెస్‌లో అలంకరణ పనుల పేరుతో బయటి వ్యక్తులను తీసుకొస్తున్నారని, వారి వల్ల ఆస్తులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

24
20 ఏళ్ల లీజు ఒప్పందమే వివాదానికి ప్రధాన కారణం

యలహంక ప్యాలెస్‌ను భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ 2007 మార్చి 1న తమ సంస్థకు 20 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇచ్చారని సిలికాన్ బిల్డర్స్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2027 ఫిబ్రవరి 28 వరకు లీజు కొనసాగుతుందని వివరించారు. ప్యాలెస్‌ పరిధిలోని పండ్ల తోటలు, మొక్కలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాల అభివృద్ధికి సంస్థ భారీగా ఖర్చు చేసిందని వాదించారు. అయితే, సుగుణమ్మ 2026 ఆగస్టు 27న గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా ఆస్తిని తన కుమార్తె భారతి, మనుమరాళ్లకు బదిలీ చేశారని తెలిపారు. గతంలో గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా నివసించేందుకు అనుమతి పొందిన షర్మిల ఇప్పుడు ప్యాలెస్‌ పరిధిలోకి ఇతరులను తీసుకొస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

34
షర్మిల ప్రవేశంపై మధ్యంతర నిషేధం

పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుధీర్‌ మేడమ్మయ్య కోర్టులో వాదనలు వినిపిస్తూ.. షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తుల జోక్యం కొనసాగితే ప్యాలెస్‌లోని నిర్మాణాలు, ఫెన్సింగ్‌, పండ్ల చెట్లు, ఇతర చరాస్తులకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమర్పించిన ఆధారాలు, వాదనలను పరిశీలించిన న్యాయాధికారి.. ప్రాథమికంగా ప్యాలెస్‌ పిటిషనర్‌ స్వాధీనంలో ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణ జరిగే వరకు షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు, సంబంధిత వ్యక్తులు ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఆస్తిలోని వస్తువులు, నిర్మాణాలకు ఎలాంటి నష్టం కలిగించకూడదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు.

44
కుమార్తె పెళ్లి వేదిక విషయంలో మొదలైన వివాదం

యలహంక ప్యాలెస్‌ వివాదానికి ప్రధాన కారణాల్లో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం కూడా ఒకటి. తన కుమార్తె పెళ్లిని ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల భావించి ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. అయితే, తాను నివసిస్తున్న ప్రాంగణంలో వివాహ వేడుక నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు షర్మిలకు లేఖ రాస్తూ.. తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో వివాహ వేదికను మరోచోటికి మార్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ప్యాలెస్‌కు వెళ్లాలని షర్మిల భావించినట్లు వార్తలు వచ్చాయి.

ప్యాలెస్‌ వద్ద ఏం జరగనుంది?

కుమార్తె వివాహానికి జగన్‌ను ఆహ్వానించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి యలహంక ప్యాలెస్‌కు వెళ్లి అక్కడ బస చేయాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగన్‌ వర్గం ముందస్తుగా న్యాయపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. షర్మిల నేరుగా ప్యాలెస్‌కు వస్తే భద్రతా సిబ్బంది అడ్డుకోవాల్సి వస్తుందని, తద్వారా రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని భావించి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. మరోవైపు, ఆదివారం జగన్‌ నివాసం ముందు షర్మిల ధర్నా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారగా, తాజా న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories