
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక క్రేజీ వీకెండ్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కొండపైన వెలసిన ఆ ఏడుకొండల స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు.
భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ఒడిశా రాజధాని భువనేశ్వర్, విశాఖపట్నం మీదుగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ గురించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు, ప్రయాణ షెడ్యూల్ వివరాలు గమనిస్తే..
ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ స్పెషల్ ప్యాకేజీ పేరు వీకెంట్ ట్రిప్ టూ తిరుమల దర్శన్. దీని ప్యాకేజీ కోడ్ వచ్చేసి SCBR05. ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు సాగుతుంది. ప్రతి శనివారం ఈ టూర్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి ప్రయాణికులు పలు స్టాప్ లలో రైలు ఎక్కవచ్చు.
ఈ ప్యాకేజీలో మీకు రైలు ప్రయాణం, హోటల్ వసతితో పాటు తిరుమల శీఘ్రదర్శన టికెట్ కూడా లభిస్తుంది. అయితే, ఈ ప్యాకేజీ ఆపరేట్ కావాలంటే కనీసం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరి కంటే తక్కువ బుకింగ్స్ ఉంటే టూర్ క్యాన్సిల్ అవుతుంది.
• డే 01 (శనివారం): భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు రైలు నంబర్ 22879 లో ప్రయాణం మొదలవుతుంది. మొదటి రోజు మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది.
• డే 02 (ఆదివారం): ఉదయం 08:45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్ సిందూరి పార్క్ లేదా దానికి సమానమైన హోటల్ కు పికప్ చేసుకుంటారు. కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి తిరుపతిలోనే డిన్నర్ చేసి స్టే చేస్తారు.
• డే 03 (సోమవారం): ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి, ఉదయం 07:00 గంటలకు తిరుమల కొండకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఆ రోజు ఉండే రద్దీని బట్టి దర్శన సమయం మారవచ్చు. దర్శనం ముగిశాక కిందకు వచ్చి, హోటల్‌లో లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు ప్యాక్డ్ డిన్నర్‌తో తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 7:50 గంటలకు రైలు నంబర్ 22856 లో తిరుపతి నుంచి ప్రయాణం మొదలవుతుంది.
• డే 04 (మంగళవారం): మధ్యాహ్నం 3:37 గంటలకు తిరిగి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో మీ టూర్ సక్సెస్‌ఫుల్‌గా ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ కింద కంఫర్ట్ (3A), స్టాండర్డ్ (SL) క్లాసులలో ప్రయాణించే భక్తుల కోసం ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ (3A) క్లాస్‌లో ప్రయాణించాలనుకునే వారు సింగిల్ షేరింగ్‌కు రూ. 17,415, డబుల్ షేరింగ్‌కు రూ. 11,265, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 9,405 చెల్లించాల్సి ఉంటుంది. అదే క్లాస్‌లో పిల్లల కోసం బెడ్‌తో కూడిన టికెట్ ధర రూ. 7,830 కాగా, బెడ్ లేని టికెట్ ధర రూ. 7,345 గా నిర్ణయించారు.
మరోవైపు స్టాండర్డ్ (SL) క్లాస్ ప్రయాణికులకు సింగిల్ షేరింగ్‌కు రూ. 14,900, డబుల్ షేరింగ్‌కు రూ. 8,750, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 6,895 ఛార్జీలు ఉంటాయి. ఈ క్లాస్‌లో బెడ్‌తో వచ్చే పిల్లల టికెట్ ధర రూ. 5,315 కాగా, బెడ్ అవసరం లేని పిల్లలకు రూ. 4,830 గా ఉంది. రైల్వే ఛార్జీల మార్పులకు లోబడి ఈ ధరలలో మార్పులు ఉండవచ్చు.
ప్యాకేజీలో ఉండేవి..
• రైలు ప్రయాణం (3A లేదా SL క్లాస్).
• తిరుపతిలో ఏసీ హోటల్ వసతి (సింధూరి పార్క్ లేదా దానికి సమానమైన హోటల్).
• తిరుపతిలో ఏసీ వాహనం ద్వారా సైట్ సీయింగ్.
• తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూరు దర్శన టికెట్లు.
• భోజన సదుపాయం: 1 బ్రేక్‌ఫాస్ట్, 1 లంచ్, 2 డిన్నర్లు
• గైడ్ సర్వీస్, ట్రావెల్ ఇన్సూరెన్స్.
• టోల్, పార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ.
ప్యాకేజీలో లేనివి
• లాండ్రీ, టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ బిల్లులు వంటి వ్యక్తిగత ఖర్చులు.
• కెమెరా ఫీజులు, ఎంట్రీ ఫీజులు.
• తలనీలాలు సమర్పించే ప్రత్యేక ఏర్పాట్లు.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి.
• పురుషులు: తెల్లటి ధోతి-కుర్తా లేదా పైజామా ధరించాలి.
• మహిళలు: చీర లేదా పంజాబీ డ్రెస్ ధరించాలి.
• టీ షర్టులు, జీన్స్ వంటి దుస్తులు ఏ వయస్సు వారికైనా కచ్చితంగా నిషేధించారు.
• దర్శనం సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించాలి.
• పేరు, వయస్సు, లింగం వంటి వివరాలను జర్నీకి 5 రోజుల ముందు ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. రైలు టిక్కెట్లు జనరేట్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు కుదరవు.
క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు
• ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందు క్యాన్సిల్ చేసుకుంటే: రూ. 250/- (ఒక్కో ప్రయాణికుడికి) కట్ అవుతుంది. 8 నుంచి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ప్యాకేజీ ధరలో 25% కట్ అవుతుంది. 4 నుంచి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ప్యాకేజీ ధరలో 50% కట్ అవుతుంది. 4 రోజుల కంటే తక్కువ సమయంలో క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు.