Weather Updates : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇవి మరింత బలపడి తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురిపించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
IMD Weather Alert : బంగాళాఖాతంలో తుపాను... ఈ హెచ్చరికలు తెలుగు ప్రజలు కంగారు పెట్టిస్తున్నాయి. వరుసగా ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అల్పపీడనం వాయుగుండంగా... అదికాస్త తుపానుగా బలపడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
27
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ప్రస్తుత దక్షిణ అండమాన్ సముద్రంలో మలేషియా, మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ (నవంబర్ 25, మంగళవారం) కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం - శ్రీలంక ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
37
నేడు వాయుగుండం
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని APSDMA తెలిపింది. తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఈ వాయుగుండం 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపానుకు 'సెన్యార్' గా నామకరణం చేయనున్నారు.
ఈ అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది. ఒకవేళ తుపాను ఏపీలో తీరందాటితే ఆ ప్రభావం కొన్నిజిల్లాలపై ఎక్కువగా ఉంటుందని... ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదవుతోంది... రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
57
ఈ నెలాఖరున భారీ వర్షాలు
అల్పపీడనాల ప్రభావంతో నవంబర్ 25 నుండి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక నవంబర్ 29, 30 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
67
రైతన్నలూ... జాగ్రత్త
ప్రస్తుతం వరికోతల సమయం. ఈ సమయంలో వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చే అవకాశాలుంటాయి. కాబట్టి అన్నదాతలు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంద్వారా నష్ట నివారణ చేపట్టవచ్చని APSDMA చెబుతోంది.
రైతులకు ముఖ్య సూచనలు
▪️వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలి.
▪️రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలి.
▪️తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలి.
77
తెలంగాణలో తగ్గిన చలి
తెలంగాణలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది... చలి తీవ్రత తగ్గింది. గతవారం సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు పెరిగాయి... మెదక్ లో 14.3, ఆదిలాబాద్ లో 15.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోయే నాలుగైదురోజులు వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సెన్యార్ తుపాను ఏర్పడి తీరం దాటిన తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయట.