IMD Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడుపై భారీ ప్రభావం పడుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం నాటికి బలహీనపడింది. సాయంత్రం సమయంలో శ్రీలంక ఈశాన్య తీరంలో ఉన్న ముల్లయిట్టివు సమీపంలో ఇది భూభాగాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తీరం దాటే వేళ వాయుగుండం ముల్లయిట్టివుకు సుమారు 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, మన్నార్‌కు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో కరైకల్‌కు 190 కిలోమీటర్లు, చెన్నైకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
25
ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు
తీరం దాటిన తరువాత ఈ వ్యవస్థ తీవ్రత తగ్గే దిశగా కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న వాయుగుండం ఆదివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా భూభాగంపైకి వచ్చిన తరువాత ఇలాంటి వ్యవస్థలు బలహీనపడతాయి. అయినా తేమ ప్రభావం కొనసాగుతున్నంత వరకు వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది.
35
తమిళనాడులో భారీ వర్షాలకు అవకాశం
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా పడనుంది. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా ప్రాంతాలు, కోస్తా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు అమల్లో ఉన్నాయి. నాగపట్టణం, తిరువారూర్, కారైకల్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా స్వల్పంగా కనిపించనుంది. దక్షిణ కోస్తా ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడ తేలికపాటి వర్షాలు పడవచ్చని అధికారులు పేర్కొన్నారు.
55
సముద్రంలో అలజడి.. మత్స్యకారులకు హెచ్చరిక
వాయుగుండం బలహీనమైనా సముద్ర పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోత దశలో ఉన్న పంటలకు నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.