వివిధ కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయనకు పాస్ పోర్టు పొందేందుకు పెద్దగా సమస్యలు రాలేదు. దీంతో విదేశీ పర్యటనలకు ఆటంకం కలగలేదు. అయితే, ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత పాస్ పోర్టు సమస్యలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన కోర్టును ఆశ్రయించారు.
తన పాస్ పోర్టు రెన్యువల్ కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ వోసీ) జారీ చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 11న ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టు ఐదేళ్ల పాటు ఎన్ వోసీ ఇచ్చినందున ఏడాది పాటు ఎన్ వోసీ ఇవ్వడం తమ పరిధికి అతీతమని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు విధించిన షరతులను జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు.