తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ప్రమాదం ... స్కూళ్లకు సెలవు వుంటుందా?

First Published | Sep 9, 2024, 9:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలొ రేపు స్కూళ్లకు సెలవు వుంటుందా? 

Heavy Floods

Heavy Rains : తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేవు. ఇప్పటికే భారీ వర్షాలతో తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తూ జనావాసాలను చుట్టుముడుతున్నాయి. ఇలా విజయవాడను బుడమేరు, ఖమ్మంను మున్నేరు ముంచేసి ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. 

ఈ వరదలనుండి తెలుగు ప్రజలు ఇంకా బయటపడనేలేదు... సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వర్షభయం తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిషాలోని పూరీ సమీపంలో తీరం దాటింది... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ తో భారీ నుండి అతిభారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఒడిషాను వర్షాలు ముంచెత్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయని హెచ్చరిస్తున్నారు. ఏపీలో 24 గంటలపాటు వర్షాలు కొనసాగే అవకాశం వుందని... ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం వుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.  

 ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఎక్కువగా వుంటుందని వాతావరణ అధికారులు హెచ్చరంచారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.  ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 
 

Flash Floods

ప్లాష్ ప్లడ్ ప్రమాదం పొంచివున్న జిల్లాలు : 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే కురిసిన వర్షాలు విజయవాడ వంటి ప్రాంతాలను అతలాకుతలం చేసాయి. వరదనీటిలో మునిగిన విజయవాడ ఇంకా తేరుకోనేలేదు... మళ్లీ ప్లాష్ ప్లడ్ (ఆకస్మిక వరద) హెచ్చరిక ఆందోళన పెంచుతోంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు చోటుచేసుకుంటాయన్న హెచ్చరికలు అక్కడి ప్రజలను కంగారు పెడుతున్నాయి. 

భారీ వర్షాలు, ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు... నదీతీర ప్రాంతాలు, వాగులు వంకలు, చెరువుల దగ్గర్లోని గ్రామాలు, పట్టణాల ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. 

జనావాసాలను ఒక్కసారిగా ముంచెత్తెలా ఆకస్మిక వరద వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వుండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరద ప్రమాదం పొంచివున్న జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు కలెక్టర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో వున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం చుట్టుముట్టినా సంప్రదించేలా ఫోన్ నెంబర్లను విడుదల చేసారు. 
 


Flash Floods

 అసలు ప్లాష్ ప్లడ్స్ అంటే ఏమిటి? 

కొన్ని ప్రాంతాల్లో అప్పటివరకు వాతావరణం బాగానే వుంటుంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి మెల్లిగా వర్షం ప్రారంభం అవుతుంది. చూస్తుండగానే వర్షం కుండపోతగా మారి కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షం కురుస్తుంది. 

ఇలా ఆకస్మిక వర్షం నదీ తీరప్రాంతాలు, కొండప్రాంతాల్లో కురిస్తే భారీ ప్రమాదాన్ని సృష్టాస్తాయి. ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో నదులు, నీటిప్రవాహాలు ఉప్పొంగి జనావాసాలపై విరుచుకుపడతాయి. కొద్ది సేపట్లోనే వరద ఇళ్లను చుట్టుముట్టి ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని కలిగిస్తుంది. 

ఇలా అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల ఏర్పడే వరదలను ప్లాష్ ప్లడ్స్ అంటారు. ఇలా కొండప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే కొండ చరియలు విరిగిపడి మరింత ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ప్లాష్ ప్లడ్స్ వల్ల సాధారణ వరదల కంటే అత్యధిక నష్టం వాటిల్లుతుంది. 

కొన్ని రోజులపాటు వర్షం కురిసి మెళ్లిగా జనావాసాల్లోకి నీరు చేరుతుంటే అక్కడి ప్రజలు అప్రమత్తం అవుతారు. కానీ ప్లాష్ ప్లడ్ లో అలా కాదు... ప్రజలు తేరుకునే లోపే వరద ముంచెత్తుతుంది. ముందుగా జాగ్రత్తపడే అవకాశం వుండదు. కాబట్టి అప్పటికప్పుడు అప్రమత్తం అయి తప్పించుకోవాల్సి వుంటుంది. దీనివల్ల అధికంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. 

Telangana Rains

తెలంగాణకూ వర్షం ముప్పు : 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరించారు. 

ఇక ఆదిలాబాద్, నిర్మల్. నిజామాబాద్, కరీంనగర్,ములుగు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. నదీ తీర, జలాశయాల దగ్గరి, వాగులు వంకలు,చెరువుల సమీపంలోని గ్రామాలు, పట్టణాలు ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలని సూచించారు. 

హెచ్చరికలు జారీచేసిన జిల్లాల్లో 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనుండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అవసరం అయితేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచించారు. ఏదయినా ప్రమాదంలో చిక్కుకుంటే ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.

పాఠశాలలకు సెలవులుంటాయా? 

భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ఏపీ జిల్లాల్లో పరిస్థితిని బట్టి రేపు(మంగళవారం) స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలో లేదో నిర్ణయించనున్నాయి. జిల్లాలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించి సెలవులపై నిర్ణయం కలెక్టర్లే తీసుకుంటారు. ఏదయినా ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా వుంటే ఉన్నతాధికారులకు సమాచారం అందించి విద్యాశాఖ అధికారులే స్కూళ్లకు సెలవు ఇచ్చేస్తారు.

ఇప్పటికే వర్షాల కారణంగా పలుమార్లు స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. కాబట్టి విద్యార్థుల చదువు దెబ్బతినకుండా, అలాగని ప్రమాదాలు జరక్కుంగా చూసుకుని స్కూళ్లను నడిపించాల్సిన అవసరం వుంది. అందువల్లే ముందుగానే సెలవులు ప్రకటించడం లేదని వర్షప్రభావం, ప్లాష్ ప్లడ్ ప్రమాదమున్న జిల్లాల అధికారులు చెబుతున్నారు. అవసరం అనుకుంటేనే స్కూళ్లకు సెలవు ప్రకటిస్తామని చెబుతున్నారు. 

ఇక తెలంగాణలో కూడా వర్ష తీవ్రతను బట్టి స్కూళ్లకు సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో వరద ప్రభావం తక్కువే కాబట్టి స్కూళ్లకు సెలవు వుండకపోవచ్చు. 
 

Latest Videos

click me!