
Rains in Andhra Pradesh and Telangana : ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. వరికోతల సమయంలో ఈ వర్షాలు మొదలవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు వరికోత జరపగా,మరికొందరు కోతకు సిద్దమయ్యారు. ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం వుంది. కాబట్టి రైతులు వరికోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ, విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా తయారయ్యింది. పంట కోతకు వచ్చిన సమయంలో ఈ ఫెంగల్ తుపాను నిండా ముంచేందుకు వచ్చిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోతలు జరిపి పంటన కళ్లాల్లో వుంచినవారి పరిస్థితి మరీ దారుణం. ఆరుగాలాలు కష్టించి పండించిన పంట వర్షంలో తడిసిపోతుండటం చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎలాగైనా పంటను వర్షం నుండి కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అన్నదాతలు.
ఇక మరికొందరు రైతుల పరిస్థితి మరీ దారుణం. భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో కోతకువచ్చిన పంట చేతికందకుండా పొలంలోనే తడిసిముద్దయ్యే పరిస్థితి. వరద నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా పంటకోసినా, కోయకపోయినా రైతులకు నష్టం తప్పడంలేదు. ఈ సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ పంటనష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు.
వరి రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు :
1. ఇప్పటికే వరి కోసిన రైతులు వీలైనంత తొందరగా పంటను ఇంటికి చేర్చుకోవాలి. వర్ష తీవ్రత తగ్గిన తర్వాత పంటను ఎండబోసి మిల్లుకు లేదా మార్కెట్ కు తరలించాలి.
2. పంట కళ్ళంలో వుండగానే వర్షం మొదలయితే వెంటనే కుప్పగా చేసి టార్పాలిన్లు కప్పాలి. ఆ కుప్పచుట్టూ వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తపడాలి. వరిని మార్కెట్ కు తరలించి అక్కడ కుప్పగా పోసిన రైతులు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి.
3. గోనె సంచుల్లో (గన్ని బ్యాగ్స్) లో కాకుండా ప్లాస్టిక్ సంచులను వరి పంటను తరలించేందుకు ఉపయోగించాలి. ప్లాస్టిక్ సంచుల్లోకి నీరు చేరదు కాబట్టి పంట తడిసిపోకుండా వుంటుంది.
4. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లోనే ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ మద్దతు ధరకు పంటను కొంటున్నారు. కాబట్టి వర్షాలు ఇంకా మొదలుకాకుంటే వెంటనే అక్కడ అమ్ముకోవడం మంచింది.
5. ఇక ఇంకా వరికోతలు జరపని రైతులు పొలాల్లోకి వరద నీరు చేరకుండా జాగ్రత్తపడాలి. వరదనీటితో చెరువుల గండ్లు తెగకుండా రైతులంతా కలిసి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం తుఫాను తీవ్రత ఎక్కువగా వున్న నేపథ్యంలో కోతలను వాయిదా వేసుకోవాలి.
ఏపీపై ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ :
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చెరిలో ఇప్పటికే భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీలో కూడా వర్షాలు మొదలయ్యాయి... పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ(శనివారం) ఫెంగల్ తుఫాను బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతూ మద్యాహ్నానికి పుదుచ్చెరి, తమిళనాడు మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ సమయంలో తీరంవెంబడి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఏపీలోని పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశం వుంది... కాబట్టి తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా వుండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఫెంగల్ తుఫాను ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... ఆకస్మిక వరదలకు ఆస్కారం వుందని హెచ్చరించారు. మిగతా ప్రాంతాల్లో కూడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని... ఆకాశం మేఘావృతం అయి వుంటుందని ప్రకటించారు.
తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. కృష్ణపట్నంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ఇక విశాఖపట్నం,మచిలీపట్నం,నిజాంపట్నం,
కాకినాడ,గంగవరం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.
ఫెంగల్ తుఫాను పలు జిల్లాల్లో వర్షాలకు కారణమైతే మరికొన్ని జిల్లాల్లో చలి తీవ్రతను పెంచింది. అసలు శీతాకాలం చలితో వణికిపోతుంటే ఇప్పుడు ఈ తుఫాను కారణంగా వాతావరణం మరింత చల్లగా మారింది. పగటిపూట కూడా ఆకాశం మేఘాలతో కప్పేసి వుండటం... రాత్రుళ్లు, తెల్లవారుజామున పొగమంచు కప్పేస్తోంది. దీంతో ఇంటినుండి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
తెలంగాణలో వర్షాలు :
ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావం ఇవాళ,రేపు (శని,ఆదివారం) రెండ్రోజులు తెలంగాణపై వుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ఇవాళ ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్,హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ఇక రేపు (ఆదివారం) కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ముఖ్యంగా కరీంనగర్,పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్,మెదక్ మహబూబ్ నగర్, జనగామ, కొత్తగూడెం, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేటతో పాటు మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం వుందని తెలిపారు. హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... రైతులు పంటలను కాపాడుకునే జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
తమిళనాడులో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇక ఈ ఫెంగల్ తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.నాగపట్టిణం, మయలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విళుపురం జిల్లాల్లో వర్షతీవ్రత ఎక్కువగా వుంది... వరద పరిస్థితి వున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.