Sankranti holidays
Sankranti holidays : తెలుగు పల్లెల్లో సంక్రాంతి పండగ శోభ కనిపిస్తోంది. ఊరూ వాడ అంతా పండగ సంబరాల్లో మునిగిపోయారు. మగాళ్లు కోడి పందేలు, మందు పార్టీలతో... ఆడవాళ్లు ముగ్గులు, పిండివంటలతో... పిల్లలు పతంగులు, సరదా ఆటలతో ప్రతి గ్రామం సందడి సందడిగా కనిపిస్తోంది. ఇలా అందరూ పండగను ఎంజాయ్ చేస్తుంటే కొందరు ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ ఉద్యోగుల పరిస్థితి ఇంతే. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగులు మాత్రం హాయిగా కుటుంబసభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, హజ్రత్ అలీ పుట్టినరోజు నేపథ్యంలో జనవరి 14న బ్యాంకులకు సెలవు ఇచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూడురోజుల పండగ... అయినా జనవరి 13 భోగి రోజు బ్యాంకులు నడిచాయి. నిన్న జనవరి 14న ఒక్కరోజు మాత్రమే బ్యాంకులకు సెలవు. ఇవాళ కనుమ వున్నా బ్యాంక్ ఎంప్లాయిస్ కు మాత్రం సెలవు లేదు.
ఇలా పండగపూట కూడా కుటుంబంతో గడపకుండా విధులకు హాజరుకావాల్సి వస్తోందని ఏపీ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో జనవరి 15 బుధవారం కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆంధ్ర ప్రదేశ్ శాఖతో పాటు జనరల్ మేనేజర్ ఆండ్ కన్వీనర్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సర్కార్ సంక్రాంతి సెలవును పొడిగించింది.. జనవరి 15న కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
Sankranti holidays
తెలంగాణ బ్యాంకుల సంగతేంటి?
ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగులకు కనుమ సందర్భంగా సెలవు వచ్చింది. అంటే వరుసగా రెండ్రోజులు (జనవరి 14, 15) బ్యాంకులు మూతపడుతున్నాయి. మరి తెలంగాణలో బ్యాంకుల సంగతేంటి? తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ కు కూడా నిన్న(మంగళవారం) సంక్రాంతి సెలవు ఇచ్చారు? మరి ఏపీలో మాదిరిగా జనవరి 15న కనుమకు కూడా సెలవు ఏమైనా ఇచ్చారా? అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలంగాణలో కేవలం ఒక్కరోజే సంక్రాంతి సెలవు ప్రకటించారు. జనవరి 14న మాత్రమే సెలవు... జనవరి 15న కనుమ సందర్భంగా ఎలాంటి సెలవు ప్రకటించలేదు రేవంత్ సర్కార్. అందువల్ల ఇవాళ (బుధవారం) తెలంగాణలోని బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి. అయితే పండగ నేపథ్యంలో ఎక్కువమంది ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం వుంటుంది... కాబట్టి బ్యాంక్ పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి.
ఇక గత మూడునాలుగు రోజులుగా వరుస సెలవులు వచ్చాయి. జనవరి 11 రెండో శనివారం, జనవరి 12 ఆదివారం సాధారణ సెలవు వచ్చింది. జనవరి 13 సోమవారం బ్యాంకులు నడిచాయి... ఆ తర్వాత జనవరి 14 సంక్రాంతి సెలవు వచ్చింది. ఇలా వరుస సెలవుల తర్వాత బ్యాంకులు ఓపెన్ అవుతున్నాయి... ఉద్యోగులు తక్కువగా వుండే అవకాశం వుంది... కాబట్టి బ్యాంకుల్లో రద్దీ వుండే అవకాశం వుంది. ఈ విషయాన్ని గుర్తించి బ్యాంకు పనులు వున్నవారు ప్లాన్ చేసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఇవాళ(బుధవారం) కూడా సెలవు వుంది... కాబట్టి రేపు (జనవరి 16,గురువారం) బ్యాంకులు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్కడ కూడా బ్యాంకులు తెరిచేరోజు రద్దీ ఎక్కువగా వుండే అవకాశం వుంది.
Bank Holidays
ఇవాళ ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు :
జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులు మూతపడ్డాయి. అలాగే వివిధ వేడుకల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ , తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఒడిషా, కేరళ, పంజాబ్, సిక్కిం, అస్సోం,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో బ్యాంకులు మూతపడ్డాయి.
జనవరి 15న బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలాగే తిరువళ్ళువర్ దినోత్సవం, మాఘ బిహు పూజ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. జనవరి 16న కూడా ఉజ్జవర్ తినునాల్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే తమిళనాడులో వరుసగా మూడు రోజులు పొంగల సెలవులు వచ్చాయన్నమాట.
ఇలా ఈ జనవరిలో ఇప్పటికే బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా వివిధ రాష్ట్రాల్లో వేరువేరు కారణాలతో బ్యాంక్ ఉద్యోగులకు సెలవులున్నాయి. అయితే బ్యాంకులు పనిచేయకున్నా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో వుంటాయి కాబట్టి ఏ బ్యాంక్ వినియోగదారులకైనా పెద్ద ఇబ్బంది వుండదు.