తిరుమలలో పెళ్లికి ఎవరు అర్హులు :
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆర్థికంగా వెనకబడిన పేద హిందువులకు ఉచితంగా వివాహాలు చేస్తోంది. గత తొమ్మిది పదేళ్లుగా తిరుమలలోని కల్యాణ వేదికలో ఈ పెళ్లిళ్లు నిర్వహిస్తోంది. అయితే ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లికి కేవలం పేదవారికే అవకాశం కల్పిస్తున్నారు.
వధూవరులు చట్టబద్దంగా పెళ్ళి చేసుకునే వయసు కలిగివుండాలి. అంటే అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు పైబడి వయసు కలిగివుండాలి. ప్రేమ వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసుకునేవారికి తిరుమలలో అవకాశం ఉండదు. అందుకే వధూవరుల తల్లిదండ్రులు తప్పకుండా పెళ్లికి హాజరుకావాల్సి ఉంటుంది... లేదంటే వాళ్లు ఎందుకు రాలేదో సరైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆర్థిక స్తోమత సరిగ్గా లేని జంటలకే తిరుమలో పెళ్లికి అవకాశం ఇస్తారు. ఇలా ఇప్పటివరకు వేలాది జంటలు తిరుమలలో పెళ్లిపీటలెక్కారు. అందరిలా ఆడంబరంగా పెళ్లి చేసుకోలేకపోయినా శ్రీవారి సన్నిధిలో ఒక్కటయ్యామనే సంతృప్తి ఆ జంటలకు ఉంటుంది.