దిత్వా తుపాను ప్రభావం సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ఈ రెండు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటితో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ఇక కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.