తిరుమల లడ్డూలో మంసాహారం ... వైసిపి హయాంలో ఘోర అపచారం

First Published | Sep 19, 2024, 1:35 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందని... స్వామివారి లడ్డు ప్రసాదంలో మాంసాహారం ఉపయోగించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Tirumala Laddu

Tirumala Laddu : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడిపోయింది. ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారనే అపవాదు వుంది. ఈ ప్రచారం ప్రజల్లోకి మరీ ముఖ్యంగా హిందువుల్లోకి బలంగా వెళ్లింది. ఎంతలా అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాభవానికి తిరుమల వ్యవహారం కూడా ఓ కారణమే. 

Roja

పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరస్వామిపై ప్రజలకు ఉన్న భక్తిని వైసిపి వ్యాపారంగా మార్చిందని...ఆనాటి మంత్రి రోజా స్వామివారి దర్శనం, పూజల పేరిట కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలున్నాయి.  అలాగే స్వయంగా సీఎం హోదాలో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి ఆలన పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారనే ప్రచారం ఎన్నికల వేళ జోరుగా సాగింది. అలాగే వైవి సుబ్బారెడ్డిని టిటిడి ఛైర్మన్ గా నియమించడం కూడా వివాదాస్పదంగా మారింది. 

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసిపి, వైఎస్ జగన్ ఓటమికి అనేక కారణాలున్నాయి... అందులో తిరుమల వ్యవహారం కూడా ఒకటి. అందువల్లే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదట తిరుమల నుండే ప్రక్షాళన చేపడతానని చేసిన కామెంట్స్ కూడా హైలైట్ గా మారాయి. అయితే వైఎస్ జగన్ అధికారాన్ని కోల్పోయినా తిరుమల వ్యవహారం మాత్రం అతడిని వదిలిపెట్టడంలేదు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసిపి హయాంలో జరిగిన సంఘటనలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ హయాంలో తిరుమలలో ఎంత అపచారం జరిగిందో బయటపెట్టారు. ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూలో మాంసాహారాన్ని పదార్థాలను వాడారంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో తిరుమల భక్తులు, హిందుత్వ సంఘాలు మాజీ సీఎం వైఎస్ జగన్ పై భగ్గుమంటున్నారు. 
 


tirupati laddu

తిరుమల లడ్డుపై చంద్రబాబు కామెంట్స్ : 

బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసగించారు. 

ఈ సందర్భంగానే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసిపి పాలకులు ఎలా వ్యవహరించారో చంద్రబాబు వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను అపవిత్రం చేయడమే కాదు భక్తుల మనోభావాలతోనూ గత పాలకులు ఆడుకున్నారని ఆరోపించారు. ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో మాంసాహార పదార్థాలు వాడారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.

సహజంగా తిరుమల లడ్డూ తయారీతో స్వచ్చమైన నెయ్యిని ఉపయోగిస్తారు. కానీ గత ప్రభుత్వం, టిటిడి పాలకమండలి లడ్డూ నాణ్యత గురించి పట్టించుకోలేదు... ఎలావుంటే తమకేంటి అన్నట్లుగా వ్యవహరించారని అన్నారు. దీంతో స్వచ్చమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారుచేసే పదార్థాలను వాడారన్నారు. ఈ లడ్డూలనే భక్తులకు అమ్మారని చంద్రబాబు  తెలిపారు. 

ఇలా తిరుమలను వైసిపి పాలకులు ఎంతో అపవిత్రం చేసారు...తమ అక్రమార్జన కోసం కూడా శ్రీవారిని వాడుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయితే అలాంటి తప్పులు ఇక స్వామివారి సన్నిధిలో జరగవు...తిరుమల పవిత్రతను కాపాడి ప్రతిష్టతను పెంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు.   
 

tirupati laddu

చంద్రబాబు కామెంట్స్ పై వివాదం : 

తిరుమల పవిత్రత, స్వామివారి లడ్డూ ప్రసాదం తయారిపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. మాజీ టిటిడి బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యలపై స్పందించగా... టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇలా వైసిపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. 

''దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు.'' అంటూ ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు సుబ్బారెడ్డి. 

''రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?'' అని సవాల్ చేసారు వైవి సుబ్బారెడ్డి. 
 

tirupati laddu

వైవి సుబ్బారెడ్డికి అదే ఎక్స్ వేదికన కౌంటర్ ఇచ్చారు టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.''ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే సుబ్బారెడ్డి ... మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు ఎవరూ ఇలాంటి పనులు చెయ్యరు. కానీ మీరు చేశారు అనేదే సిఎంగారి ఆవేదన, బాధ'' అన్నారు. 

''మీరు తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్దికోసం ఎలా వాడుకున్నారో....భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో....కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మరిచిపోలేదు....మరిచిపోరు కూడా! మీరు చేసిన పాపాలకు శిక్షే నిన్నటి ప్రజాగ్రహం. ఆ దేవుని సన్నిధికి వచ్చే నైతిక అర్హత కూడా మీరు కోల్పోయారు అనేది ముందు తెలుసుకోండి'' అంటూ వైవి సుబ్బారెడ్డిపై మండిపడ్డారు సోమిరెడ్డి. 
 

Latest Videos

click me!