
Andhra Pradesh Liquor Policy 2024 : ఆంధ్ర ప్రదేశ్ నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో ఇంతకాలం అధిక ధరలతో బెంబేలెత్తిపోయి జేబులు ఖాళీ చేసుకున్న మందుబాబులకు ఇకపై ఊరట లభించనుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలో కూడా తక్కువ ధరకే మద్యం లభించనుంది. అంతేకాదు ఇప్పుడున్న బ్రాండ్ల స్థానంలో నాణ్యమైన, ప్రజల ఆరోగ్యానికి హాని చేయని మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. ఇలా ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కాపాడే మద్యం పాలసీని వచ్చేనెల (అక్టోబర్) ఆరంభం నుండి అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది.
ఏపీలో మందు రేట్లు ఎలా వుండనున్నాయంటే :
ఇవాళ (బుధవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్న మద్యం పాలసీపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. గత ఐదేళ్లుగా సాగిన మద్యం విధానంపై మంత్రివర్గంలో తీవ్రంగా వ్యతిరేకించింది... దీన్ని ఇంకా కొనసాగించడం రాష్ట్రానికే కాదు ప్రజలకు కూడా ఏమాత్రం మంచిదికాదని కేబినెట్ అభిప్రాయ పడింది. దీంతో వెంటనే నూతన మద్యం పాలసీ అమలుకు ఆమోదం తెలిపింది చంద్రబాబు కేబినెట్.
తాజాగా మద్యం పాలసీ ప్రకారం ప్రముఖ బ్రాండ్ల మద్యంనే ఇకపై రాష్ట్రంలో అమ్మాలని... ఎట్టి పరిస్థితుల్లో నకిలీ మద్యం బ్రాండ్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అంతేకాదు తక్కువ ధరకే అంటే రూ.99 ధర నుండే మద్యం అందుబాటులో వుంచాలని నిర్ణయించారు. బీర్ ధరలు కూడా కనిష్టంగా రూ.130 నుండే అందుబాటులో వుండేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సామాన్యులకు అందుబాటు వుండేలా మద్యం ధరలను నిర్ణయించాలని... ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా సరే ప్రజలపై భారం పడకుండా చూడాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశానుసారమే మద్యం నూతన లిక్కర్ పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్దం చేసింది. వీటికి నేడు కేబినెట్ ఆమోదం లభించింది.
కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు :
ఆంధ్ర ప్రదేశ్ నూతన లిక్కర్ పాలసీ విధివిధానాలను రూపొందించే బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘంకు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్,గొట్టిపాటి రవికుమమార్ లతో ఈ ఉపసంఘం ఏర్పాటుచేసారు.ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో అమలులో వున్న మద్యం విధానాలను పరిశీలించడంతో పాటు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నూతన మద్యం పాలసీని ఖరారు చేసింది ఈ ఉపసంఘం.
నిన్న (మంగళవారం) మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మరోసారి నూతన మద్యం విధానంపై చర్చించింది. చివరగా సిద్దంచేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచారు. వీటిని పరిశీలించిన ఆయన పలు సలహాలు, సూచనలిచ్చారు. అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు రూపొందించి ఇవాళ కేబినెట్ ముందుంచారు... ఈ నూతన మద్యం విధానానికి ఆమోదం లభించింది.
నూతన మద్యం విధానంలో అత్యంత కీలకమైనది వైన్ షాప్స్ నిర్వహణ. గత ప్రభుత్వం మద్యం దుకాణాలను స్వయంగా నిర్వహించింది... ఈ విధానానికి స్వస్తి పలకనుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని వైన్స్ ల నిర్వహణ గతంలో మాదిరిగానే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు.
మద్యం రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3,396 వైన్స్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు అదనంగా మరో 396 (10 శాతం) వైన్స్ లను కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిపై చేసారు. వీటిని లాటరీ విధానంలో కేటాయించనున్నారు.
గీత కార్మికులకు కేటాయించినవ మినహా మిగతా మద్యం దుకాణాలకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన దరఖాస్తు రుసుము చెల్లించి ఎవ్వరైనా వైన్స్ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. నిర్ణీత సమయంలో, నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారిలో నుంచి లాటరీ ద్వారా ఎంపికయిన వారికి వైన్స్ ఏర్పాటుచేసుకునే అవకాశం లభిస్తుంది.
అక్టోబర్ ఆరంభంలోనే న్యూ లిక్కర్ పాలసీ :
ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది... ఇక చట్టపరమైన చర్యలు తీసుకోవడమే తరువాయి. గత వైసిపి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో వున్న వైన్స్ లను తొలగించి ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టేలా ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది. అయితే మళ్లీ ఈ చట్టాన్ని సవరించాలంటే అసెంబ్లీ ద్వారానే సాధ్యం. కానీ ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేవు... దీంతో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి నూతన మద్యం విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
నూతన మద్యం పాలసీని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమలులోకి తీసుకువచ్చేందుక ప్రయత్నిస్తోంది చంద్రబాబు సర్కార్. అందుకోసమే ఆర్డినెన్స్ ద్వారా అమలుకు సిద్దమయ్యింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం లభించింది కాబట్టి మరో రెండుమూడు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు.
ఈ నెల (సెప్టెంబర్) 23 వరకు నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వైన్స్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఇందుకోసం కనీసం వారం రోజులైనా సమయం ఇవ్వాల్సి వుంటుంది. ఆ తర్వాత లాటరీ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారిలో వైన్స్ ఎవరికి కేటాయించాలో నిర్ణయిస్తారు. ఆ తర్వాత నూతన మద్యం పాలసీ ప్రకారం విక్రయాలు జరగనున్నాయి.
ఈ ప్రక్రియ అంతా జరగడానికి కనీసం మరో పదిపదిహేను రోజుల సమయం పడుంతుంది. అంటే వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో కొత్త వైన్స్ లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏ బ్రాండ్ మద్యం అమ్మకాలకు చంద్రబాబు సర్కార్ అనుమతి ఇస్తుందో చూడాలి.