Pawan Kalyan
Chief Minister Chandrababu: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాలనుకుంటోంది. దీనిలో భాగంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనుంది.
Pawan Kalyan
నేరుగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్
లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయం కోరుతూ IVRS కాల్స్ వెళతాయి. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని పని చేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్దిదారుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా.....దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.
free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas
పౌర సేవలపైనా అభిప్రాయ సేకరణ
పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా IVRS ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. నేరుగా ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే..వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు.
ప్రజలు చెప్పిందే ఫైనల్
ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే విషయం ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఒపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం కోరుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ కు ప్రజలు వెచ్చించే ఒకటి రెండు నిముషాల సమయంతో ప్రభుత్వ నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని...మంచి పాలనకు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
Chandra Babu
ఐపీఆర్ఎస్ తో మెరుగైన ఫలితాలు
ఐవిఆర్ఎస్ విధానం ద్వారా వచ్చే ఖచ్చితమైన అభిప్రాయాల ద్వారా గతంలో మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానాన్ని పాటించారు. అలాగే విజయవాడ వరదల సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సాయంపైనా కాల్స్ ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.