బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్, ఉషా సునాక్‌లతో ఆయన అత్త సుధా మూర్తి కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చారు. వారంతా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం.. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మంత్రాలయం నుంచి ప్రసాదం, మంత్రాక్షం ఇచ్చి ఆశీస్సులు అందజేశారు.
ఈ విషయాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బుధవారం వెల్లడించింది. ‘‘ఈరోజు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ మంత్రాలయాన్ని సందర్శించారు. వారి వెంట ఇన్ఫోసిస్ సుధా నారాయణ మూర్తి ఉన్నారు. వారంతా కలిసి శ్రీ రాయారు దర్శనం చేసుకున్నారు. వారి సందర్శన సమయంలో శ్రీ స్వామీజీ వారికి వస్త్రం, ఫల మంత్రాక్షతే, జ్ఞాపికతో తన ఆశీర్వాదాన్ని అందించారు.’’ అని పోస్టులో పేర్కొంది.
ఇక, బ్రిటన్ వెళ్లిన తర్వాత రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు కూడా ప్రసాదం అందజేయమని యశ్వీర్ సునాక్, ఉషా సునాక్‌లకు మంత్రాలయం పీఠాధిపతి తెలిపారు.
ఇక, జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సమయంలో.. తన భారతీయ మూలాలు, భారత్‌తో తనకున్న సంబంధాల గురించి చాలా గర్వపడుతున్నట్లు రిషి సునాక్ చెప్పారు. రిషి సునక్, అక్షతా మూర్తి దంపతులు ఆదివారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించారు.
Rishi Sunak
రిషి సునాక్ గతేడాది బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రిషి సునాక్ తల్లిదండ్రులు గతేడాది వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.