రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకే నాణ్యమైన సరుకులను పంపిణీ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మార్కెట్లో సరుకుల ధరలు మండిపోతుండటంతో, సామాన్యుడిపై రూపాయి భారం పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, గోధుమపిండి, పామోలిన్ ఆయిల్ అందించాలని నిర్ణయించింది. రానున్న పండగల సీజన్లో పేదలందరికీ పూర్తి ఊరట కలిగించేలా ఈ పంపిణీ ప్రణాళికను సిద్ధం చేశారు.
24
ఏ సరుకు ఎంత ధరకు లభిస్తుందంటే.. పక్కా రేట్ల వివరాలు ఇవే
ధరల నియంత్రణ సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కే. కన్నబాబు ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నూతన నిబంధనల ప్రకారం రేషన్ కార్డుదారులకు అందించే నిత్యావసరాల రేట్లు ఇలా ఉన్నాయి..
• కందిపప్పు: కిలో కేవలం రూ.100 మాత్రమే.
• గోధుమపిండి: కిలో కేవలం రూ.25 కే లభిస్తుంది.
• పామోలిన్ ఆయిల్: లీటరు కేవలం రూ.125 మాత్రమే.
ఈ ప్రత్యేక పంపిణీ కింద ఒక్కో రేషన్ కార్డుపై ప్రతి నెలా ఒక కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్ కచ్చితంగా అందిస్తారు. ఇక చక్కీ అట్టాను కిలో చొప్పున 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పద్ధతిలో విక్రయించనున్నారు.
34
మూడేళ్ల సబ్సిడీ ప్లాన్.. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్
క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన క్రిస్మస్, మన తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు నుంచి వరుసగా మూడు నెలల పాటు ఈ రాయితీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం మార్కెట్ జోక్య పథకం కింద నెలకు రూ.100.20 కోట్ల చొప్పున, మూడు నెలల కాలానికి మొత్తం రూ.300.60 కోట్ల భారీ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం భరించనుంది.
ఈ పూర్తి ఖర్చును రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తన సొంత నిధుల నుంచే కేటాయించనుంది. పంపిణీకి ఎలాంటి కొరత రాకుండా నెలకు 14,888 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 14,888 కిలోలీటర్ల పామాయిల్, 3,384 మెట్రిక్ టన్నుల చక్కీ అట్టాను సిద్ధంగా ఉంచేందుకు సర్కార్ పక్కా ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్రం కేటాయింపులు.. పామాయిల్ కొనుగోళ్లపై నిబంధనలు
ధరల స్థిరీకరణ నిధి కింద తమకు 1.20 లక్షల టన్నుల కందులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ, తొలి విడతగా కేంద్రం 40,338 టన్నుల కందులను కేటాయించింది. ఈ లభ్యత ఆధారంగా ముడి కందులను సేకరించి, పప్పు తయారీకి అవసరమైన ఒప్పందాలను వేగవంతం చేయాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీలను కమిషనర్ ఆదేశించారు.
మరోవైపు, పామోలిన్ ఆయిల్ కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకమైన పోటీ విధానంలో చేపట్టాలని సూచించారు. తొలుత ఈ ప్రాజెక్ట్ మూడే నెలల పాటు అమల్లో ఉంటుంది. ఒకవేళ మూడు నెలల తర్వాత కూడా ఈ సబ్సిడీ పంపిణీని పొడిగించాల్సి వస్తే, మళ్లీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.