బోరుగడ్డ అనిల్‌, వంశీ, పోసాని.. నెక్ట్స్‌ అరెస్ట్‌ అయ్యేది ఎవరు? సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న పేర్లు ఇవే..

Published : Feb 27, 2025, 11:22 AM ISTUpdated : Feb 27, 2025, 11:27 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై విమర్శలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బోరుగడ్డ అనిల్‌తో మొదలైన ఈ అరెస్టుల పరంపర కొనసాగుతోంది..   

PREV
18
బోరుగడ్డ అనిల్‌, వంశీ, పోసాని.. నెక్ట్స్‌ అరెస్ట్‌ అయ్యేది ఎవరు? సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న పేర్లు ఇవే..

'కష్టాలు ఎదురవుతాయని తెలుసు. అరెస్టులు జరుగుతాయని తెలుసు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాము'. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. జగన్‌ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టులు కొనసాగుతున్నాయి. 

28
Borugadda-anil

బొరుగడ్డ అనిల్‌తో మొదలు..

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ బొరుగడ్డ అనిల్ కుమార్‌తో ఏపీలో అరెస్టులు మొదలయ్యాయి. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలను దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనిల్ పై  ఏకంగా 17కేసులు ఉన్నాయి. ఇక అనిల్‌కు బెయిల్‌ కూడా నిరాకరించింది ఏపీ హైకోర్ట్‌. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బొరుగడ్డ అనిల్ హైకోర్టు లో పిటిషన్ వేశారు. అయితే.. ఆ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. 

38

తాజాగా వంశీ అరెస్ట్‌.. 

ఇక వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసులో వంశీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ప్రస్తుతం వంశీ విచారణ కొనసాగుతోంది. 

48

పోసాని కృష్ణ మురళీ..

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, జనసేన నేతలను దూషించారన్న కారణాలతో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదుకాగా ఆయనను బుధవారం రాత్రి రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ను ఏపీకి తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఆయన్ను అరెస్ట్‌ చేశారు. రాజంపేట కోర్టులో ఆయనను హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పినా..

ఇదిలా ఉంటే ఏపీలో అరెస్టులు మొదలు కావడంతో తన అరెస్ట్‌ కూడా తప్పదని భావించిన పోసాని గత కొన్ని రోజుల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడడని, ఎవరి పక్షాన నిలబడడని చెప్పుకొచ్చారు. అయినా అరెస్ట్‌ తప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను దూషించిన విషయం తెలిసిందే. ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి మరీ పవన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అందుకే ఈ అరెస్ట్‌ అని పలువురు చర్చించుకుంటున్నారు. 

58

నిజానికి వర్మ అరెస్ట్‌ అవ్వాల్సింది.. 

నిజానికి పోసానీ కృష్ణ మురళీ కంటే ముందు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అరెస్ట్‌ కావాల్సి ఉండేది. వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, పవన్‌లకు సంబంధించిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్ చేశారన్న కారణంతో ఒంగోలు పోలీసులు వర్మను అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌ వచ్చారు. అయితే ఆ సమయంలో వర్మ తాను అందుబాటులో లేనని, కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానంటూ తప్పించుకు తిరిగారు. దీంతో వర్మ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారంటూ వార్తలు వచ్చాయి. 

అయితే తాను ఎక్కడికి పోలేదని, ఇతర పనుల కారణంగానే పోలీసుల విచారణకు హాజరుకాలేకపోయాయని వర్మ యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వర్మ స్వయంగా ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

68

నెక్ట్స్ ఎవరు.? 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో తర్వాత అరెస్ట్‌ అయ్యేది ఎవరన్న దానిపై ఇప్పుడు సర్వత్ర చర్చ మొదలైంది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వీరిలో మొదటి వరుసలో ఉన్నారు వైసీపీ నేత కొడాలి నాని. వైసీపీ హయాంలో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని అప్పట్లో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో కామెంట్స్‌ చేశారు. 

వంశీ తర్వాత అరెస్ట్‌ అయ్యేది కొడాలి నాని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల ఓ మీడియా రిపోర్టర్‌తో మాట్లాడిన నాని మూడు కాకపోతే 30 కేసులు వేసుకొని, ఇంత మంది లాయర్లు ఉన్నారు వాళ్లు చూసుకుంటారని నాని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం కవరింగ్ కోసమేనని, నానికి కూడా తన అరెస్ట్‌ తప్పదని తెలిసిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే వైసీపీ ఓటమి తర్వాత కొడాలి నాని చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. 
 

78

రోజా పేరు.. 

ఇక అరెస్ట్‌ అయ్యే వారి జాబితాలో మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది. వైసీపీ హాయంలో చంద్రబాబు అండ్‌ కో పై విరుచుకుపడ్డ వారిలో రోజా కూడా ఒకరని తెలిసిందే. అయితే జగన్‌ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా వంద కోట్ల స్కామ్‌ చేసిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆత్యాపాత్యా చీఫ్‌ ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకి వచ్చాయి. 
 

88

రేషన్‌ బియ్యం కేసులో పేర్ని నాని.. 

ఇక తర్వాత అరెస్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్న వారి జాబితాలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని పేరు కూడా వినిపిస్తోంది. గోదాము నుంచి రేషన్‌ బియ్యం మాయం చేయడంలో నాని కీలక పాత్ర పోషించారని హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్ నివేదించారు. వాస్తవాల వెలికితీతకు కస్టడీ విచారణ అసవరం ఉందని పేర్కొన్నారు. అయితే పేర్నీ నాని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పేర్ని నాని కూడా ఏదో ఒక రోజు అరెస్ట్‌ కావడం ఖాయమని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. మరి కూటమి ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయి, ఇంకెంత మంది అరెస్ట్‌ అవుతారో చూడాలి. 
 

click me!

Recommended Stories