గతంలో నామినేషన్లు, పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎస్ఈసీ, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఐజీ రాజకుమారి పర్యవేక్షణలో సుమారు 40,679 మంది పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31,460 పోలింగ్ కేంద్రాలలో 8,904 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 7,160 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రాయలసీమలోని సున్నిత ప్రాంతాల్లో 111 ఏపీఎస్పీ (APSP) ప్లటూన్లను ప్రత్యేకంగా మోహరించారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టారు. 16,064 కేంద్రాల్లో సీసీటీవీలు, 6,000 చోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో ప్రత్యక్ష వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే వె వెంటనే ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ అక్కడకు చేరుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై 330 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 100 మందిని అరెస్ట్ చేశారు.